
కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు ఢిల్లీ నుంచి గల్లీల దాకా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ హోంమంత్రి అమిత్ షా గత వారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాండ్యాలోని ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని,
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ని ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ మత ఆధారిత రిజర్వేషన్లను ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలమైన ''డబుల్ ఇంజన్ ప్రభుత్వం'' కారణంగా గత ఆరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 2బి కేటగిరీ కింద ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సీఎం యోగి మాట్లాడుతూ.. మత ఆధారిత కోటాకు రాజ్యాంగపరమైన మద్దతు లేదని పేర్కొన్నారు. కర్ణాటకలోని బిజెపి సర్కార్ ఇటీవల ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ నాలుగు శాతం రిజర్వేషన్‌లను రెండు సమాన భాగాలుగా విభజించి, రాష్ట్రంలోని రెండు ఆధిపత్య కమ్యూనిటీలు 2సిలోని వొక్కలిగాస్, 2డి కేటగిరీలోని లింగాయత్‌లకు రెండు శాతం కోటాను పెంచింది.
సీఎం యోగి ఇంకా మాట్లాడుతూ.. 1947లో భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజించారనీ, దేశం మత ఆధారిత రిజర్వేషన్‌ను ఆమోదింలేమనీ, తాము మరొక విభజనకు సిద్ధంగా లేమన్నారు. కేంద్రం, కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వాలు పిఎఫ్‌ఐని నిషేధించాయని, ఇలాంటి ఇస్లామిక్ సంస్థ వెన్ను విరిచాయని ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చామనీ, అక్కడ ఎలాంటి కర్ఫ్యూ, అల్లర్లు లేవనీ,అంతా బాగానే ఉందన్నారు. గత ఆరేళ్లలో ఎటువంటి అల్లర్లు జరగలేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి, పురోగతిని ప్రశంసిస్తూ.. బీజేపీ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన మాత్రమే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు.