ఢిల్లీలో కరోనా కేసుల(Corona Cases) పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ ఎల్లో అలర్ట్ (Yellow alert in Delhi) జారీచేసింది. కరోనా కట్టడిలో భాగంగా భారీగా ఆంక్షలు విధించింది. సినిమా హాళ్లు (cinema halls), జిమ్స్, యోగా సెంటర్లను మూసివేయనున్నారు.
ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమైన కేజ్రీవాల్.. ఢిల్లీలో మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం ఢిల్లీ సర్కార్ ఎల్లో అలర్ట్ (Yellow alert in Delhi) జారీచేసింది. ఈ ఆంక్షలకు సంబంధించి ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ‘రెండు రోజులకు పైగా ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు 0.5 శాతానికి పైనే ఉంటోంది. అందుకే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్-1ను (ఎల్లో అలర్ట్) అమల్లోకి తీసుకొస్తున్నాం. అమలు చేసే ఆంక్షల వివరాలతో ఆదేశాలు త్వరలోనే విడుదల చేస్తాం’’అని అధికారులతో సమీక్ష అనంతరం సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఏల్లో అలర్ట్ ప్రణాళికలో భాగంగా ఆంక్షల జాబితాతో కూడిన ఉత్తర్వులను విడుదల చేసింది. ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచిఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. జిమ్స్, యోగా సెంటర్లును మూసివేయనున్నారు. విద్యాసంస్థల తెరవడానికి అనుమతించరు. ఇక, రద్దీ కొనసాగితే, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మార్కెట్‌లను మూసివేయవలసి వస్తుంది అని కేజ్రీవాల్ అన్నారు.
undefined
కొత్త ఆంక్షల ప్రకారం అనుమతించబడేవి..
-రెస్టారెంట్లు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరుకు 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అవకాశం కల్పించారు. బార్‌లు మధ్యాహ్నం 12-10 గంటల మధ్య కూడా 50 శాతం సామర్థ్యంతో తెరుచుకోవచ్చు.
-అత్యవసరం కాని సేవలు, వస్తువులు అందించే దుకాణాలు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి.
-నిర్మాణ పనులు కొనసాగుతాయి
-హోటళ్లు తెరుచుకోవచ్చు.. కానీ హోటల్‌లోని బాంకెట్, కాన్ఫరెన్స్ హాల్స్ తెరిచేందుకు అనుమతి నిరాకరించారు.
-ప్రజా రవాణాలకు 50 శాతం సామర్థ్యంతో అనుమతించారు. ఢిల్లీ మెట్రో (delhi metro) 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడవనుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుస్తాయి.
-ఆటో, ఈ-రిక్షా, టాక్సీ, సైకిల్ రిక్షాలో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించారు.
-సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరిచి ఉంచున్నారు.
-వివాహ వేడుకలు, అంత్యక్రియలకు 20 మంది పాల్గొనడానికి మాత్రమే అనుమతిస్తారు. అయితే బాంకెట్ హాల్స్‌లో వివాహాలను నిర్వహించేందుకు అనుమతించరు.
-మతపరమైన ప్రదేశాలు తెరిచి ఉంటాయి.. కానీ భక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు.
-ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరవవచ్చు.
కొత్త ఆంక్షల ప్రకారం అనుమతించబడనివి..
-సినిమా హాళ్లు (cinema halls), మల్టీప్లెక్స్‌లు మూసివేయబడతాయి.
-బాంకెట్ హాల్స్, ఆడిటోరియంలు మూసివేయబడతాయి.
-స్పాలు, జిమ్‌లు, యోగా ఇన్‌స్టిట్యూట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసివేయబడతాయి.
-పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు మూసివేయబడతాయి.
-సామాజిక, వినోదం, మత, రాజకీయ, పండుగల పరమైన సమావేశాలపై పూర్తి నిషేధం ఉంటుంది.
-క్రీడా సముదాయాలు, స్టేడియాలు మూసివేయబడతాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లు మినహాయింపు ఇవ్వనున్నారు.
‘కిందటి సారికంటే 10 రెట్లు ఎక్కువ సన్నద్ధమయ్యాం. అయితే మీలో ఎవరికీ అనారోగ్యం కలగకూడదని కోరుకుంటున్నాము. అందుకే మాస్క్‌లు ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మార్కెట్స్, మాల్స్ వద్ద రద్దీని చూసినప్పుడు మేము ఆందోళన చెందాం. ఇది ఇలాగే కొనసాగితే మనం మార్కెట్లను మూసివేయవలసి ఉంటుంది. మీ కోసం ఈ పరిమితులు విధించబడుతున్నాయి. మీరందరూ ఆంక్షలతో విసిగిపోయారని నాకు తెలుసు, కానీ ఇది చాలా ముఖ్యం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.