
నీట్ పీజీ కౌన్సిలింగ్ (NEET-PG 2021 counselling) ఆలస్యం జరుగుతుండటంపై దేశంలోని వేలాది మంది రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎగ్జామ్ తర్వాత కాలేజ్‌ల కేటాయింపుల్లో జాప్యం జరగడం అనేది ఆమోదయోగ్యం కాదని వారు అంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA) ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు. త్వరగా నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాజాగా వైద్యుల ఆందోళనలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకన్నారు. రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మధ్యాహ్నం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రెసిండెట్ డాక్టర్లు నిరసన తెలుపగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లకుండా తమను అడ్డుకోవడంతో డాక్టర్లు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ వైద్యులు బయటకు వెళ్లకుండా అన్ని ప్రధాన గేట్లను మూసివేశారు.
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుంచి సుప్రీంకోర్టు వరకు నిరసన ప్రదర్శన చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు తమ సభ్యులలో చాలా మందిని పోలీసులు నిర్బంధించారని FORDA ఆరోపించింది. తాము ముందుకు సాగడానికి పోలీసులు అనుమతించలేదని తెలిపింది. చాలా మంది వైద్యులను పోలీస్ స్టేషన్ ముందుకు తీసుకెళ్లారని ఆ తర్వాత కొంత సమయానికి విడుదల చేశారని FORDA అధ్యక్షుడు మనీష్ తెలిపారు. పోలీసు సిబ్బంది తమ సభ్యులపై బలప్రయోగం చేశారని.. చాలా మంది వైద్యులు గాయపడ్డారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము వైద్యులపై లాఠీచార్జీ చేయలేదని, ఎటువంటి అసభ్య పదజాలం వినియోగించలేదని తెలిపారు. తాము కేవలం 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని ఆ తర్వాత విడుదల చేశామని చెప్పారు. మరోవైపు ఎయిమ్స్ డాక్టర్లు మాత్రం ఈ నిరసనలకు దూరంగా ఉన్నారు. అయితే కచ్చితమైన చర్యలు తీసుకోకపోతే.. నాన్ ఎమర్జెన్సీ సేవల నుంచి వైదొలుగుతామని కేంద్ర ఆరోగ్య మంత్రికి రాసిన లేఖలో ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.
రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన బాట పట్టడంతో.. ఆస్పత్రులలో పెషేంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జౌట్ షేషెంట్ విభాగంలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రులకు వచ్చిన పెషేంట్లు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని పలు పెద్ద పెద్ద ఆస్పత్రులలో ఇదే పరిస్థితి నెలకొంది.
అయితే ఎప్పుడో జరగాల్సిన నీట్ పరీక్ష COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలు కూడా విడదలయ్యాయి. అయితే ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన వివాదం కొనసాగతున్న నేపథ్యంలో కౌన్సిలింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా పడటంతో దేశంలోని పలుచోట్ల రెసిడెంట్ డాక్టర్లు నిరసన బాట పడుతున్నారు.