
ఢిల్లీ : దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ పేరిట సోమవారం నాడు వంద రూపాయల స్మారకనాణెం విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ నేత విజయ్ సాయి రెడ్డి ఎన్టీఆర్ పెద్ద కూతురు దగ్గుపాటి పురంధరీశ్వరిపై.. ‘ఒక్కసారి ఆలోచించమ్మా!’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో…ఎన్టీఆర్ కుటుంబంపై పలు ప్రశ్నలు సంధించారు. అందులోని విషయాలు ఇలా ఉన్నాయి…
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము.. హాజరైన నడ్డా, చంద్రబాబు, పురందేశ్వరి..
‘పురందేశ్వరి ! ఒక్కక్షణం ఆలోచించమ్మా !
- వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేసారు.
- అబిడ్స్ లో ఆయన ఇల్లు అమ్ముకున్నారు.
- బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్లు కట్టుకుని అద్దెకిచ్చారు.
- ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఆయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. ఆయన ఆశయాలకు నీళ్లు కొట్టారు.
- తండ్రిపై ప్రేమ గుండె లోతుల్లో.. హృదయాంతరాల నుంచి రావాలి కానీ, పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా !
- సమాధి తప్ప ఆయనకు స్మారక చిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటున్నారు.
- భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వశ్రమంలో మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతజ్ఞతలు మరచిపోలేమమ్మా. ’ అని ఒకట్వీట్లో పేర్కొన్నారు.
మరో ట్వీట్ లో.. ఎన్టీఆర్ గారు ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు విజయ్ ఎలక్ట్రికల్స్ రమేష్ గారికి కేవలం నాలుగు కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ల దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణగారి వాటాకు వచ్చింది. చంద్రబాబు కానీ.. పురందేశ్వరి కానీ.. ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఉంచొచ్చు కదా. ఆయన మీద మీకున్న నిజమైన ప్రేమకు అడ్డం పడుతుంది ఈ వీడియోలోని ఆయన మద్రాస్ ఇంటి ప్రస్తుత పరిస్థితి అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. మరోవైపు తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు లేఖ రాశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ సైతం దూరంగా ఉన్నారు.