
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ రోడ్డుపై హంగామా సృష్టించింది. పోలీసులనే దూషించింది. వారితోనే వాగ్వాదానికి దిగింది. అనంతరం దాడికి కూడా పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో నిందితురాలని పోలీసులు అరెస్టు చేశారు.
‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని వడోదర వీధుల్లో ఆదివారం తెల్లవారుజామున ఓ మహిళ వీరంగం చేసింది. మద్యం మత్తులో ఆమె కారు నడిపింది. ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారితో ఆ మహిళ వాగ్వాదానికి దిగింది.
అంతటితో ఆగకుండా ఆమె పోలీసులను అసభ్య పదజాలంతో దూషించింది. వారితో అసభ్యంగా ప్రవర్తించింది. దీనిని ఓ మహిళా పోలీసు అధికారి అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో పలువురు పురుష పోలీసు అధికారులపై ఆమె దాడి చేసింది. పలు సందర్భాల్లో ఆమె వారిని తోసేసింది. దీంతో ఆమెను నియంత్రించేందుకు అదనపు మహిళా పోలీసు అధికారులను పిలిపించారు.
కాసేపు డ్రామా సాగిన తర్వాత చివరకు మహిళా పోలీసులు ఆమెను పోలీస్ జీపులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ మహిళ పోలీసులను తోసేయడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం ఆ వీడియోలో కనిపిస్తోంది.