అనురాగ్ ఠాకూర్‌తో భేటీ .. రెజ్లర్ల సంచలన నిర్ణయం , జూన్ 15 వరకు ఆందోళనకు బ్రేక్

By Siva KodatiFirst Published Jun 7, 2023, 6:50 PM IST
Highlights

రెజ్లర్ల ఆందోళనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 15 వరకు తమ ఆందోళనకు విరమణ ప్రకటిస్తున్నట్లుగా వారు వెల్లడించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అనంతరం వారు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఒకానొక దశలో వీరంతా మెడల్స్‌ను గంగానదిలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి.. రెజ్లర్లతో సమావేశమైనప్పటికీ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రి ముందు 5 డిమాండ్లు వుంచినట్లుగా సమాచారం. అయితే రెజ్లర్ల ఆందోళనపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాకపోతే అనురాగ్ ఠాకూర్‌తో భేటీ తర్వాత వీరు తమ ఆందోళనను జూన్ 15 వరకు విరమిస్తున్నట్లు ప్రకటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. 

రెజ్లర్లు కేంద్రం ముందు పెట్టిన డిమాండ్లు :

  • డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవిలో మహిళను నియమించాలి
  • బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలి
  • బ్రిజ్‌భూషణ్ కుటుంబ సభ్యులెవరూ రెజ్లింగ్ సమాఖ్యలో భాగం కారాదు.
  • పాలక మండలికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
  • ఇటీవల ఢిల్లీలో ఆందోళన సందర్భంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలి

ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా, వినేష్ ఫొగాట్ రైల్వేలో వారి ఉద్యోగాలకు హాజరుకావడంతో పలు వదంతులు వ్యాప్తి చెందాయి. అయితే రెజ్లర్లు మాత్రం తాము ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చర్చల కోసం కేంద్రం నుంచి పిలుపు రావడంపై రెజ్లర్లు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇదివరకే బ్రిజ్ భూషణ్‌‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

click me!