300 అడుగుల లోతైన బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి.. 24 గంటలుగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

By Sumanth KanukulaFirst Published Jun 7, 2023, 5:29 PM IST
Highlights

రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. దీంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. దీంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సమయం గడుస్తున్న కొద్ది చిన్నారి తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. మరోవైపు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చిన్నారి  క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని ముంగోలి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పొలంలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలిక శ్రీస్తి కుష్వాహా ప్రమాదవశాత్తూ తెరిచి ఉంచిన బోరుబావిలో పడిపోయింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టి సారించారు. బాలికను సురక్షితంగా బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్ఎఫ్) బృందం ఆమెను బోర్‌వెల్ నుండి బయటకుతీసే ప్రక్రియను ప్రారంభించిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మంగళవారం సాయంత్రం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బోరుబావికి సమాంతరంగా అధికారులు లోతైన గుంతను తవ్వుతున్నారు. బోరుబావి లోతు 300 అడుగులు ఉంటుందని ఆమెను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మంగళవారం బోరుబావిలో పడిపోయిన సమయంలో.. 20 అడుగుల లోతులో బాలిక కూరుకుపోయిందని.. ఇప్పుడు మరింతగా కిందకు జారిపోయి 50 అడుగుల లోతులో కూరుకుపోయిందని అధికారులు పేర్కొన్నారు. 

బాలికను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌ను మట్టి తరలించే యంత్రాల సహాయంతో నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో రాతి నేల ఉండటం వల్ల సమయం పడుతుందని చెప్పారు. ‘‘మేము బాలికకు ఆక్సిజన్ అందిస్తున్నాము. వీలైనంత త్వరగా బాలికను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి  కార్యాలయం కూడా రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. 

click me!