
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఓ సమావేశంలో ప్రఖ్యాత తత్వవేత్త కారల్ మార్క్స్‌ను గుర్తుచేశారు. ‘కారల్ మార్క్స్ చెప్పిన ఓ మాటను మీకు గుర్తుచేయాలనుకుంటున్నా.. ప్రపంచ కార్మికులారా! ఏకం కండి. ఏకమైతే మీరు నష్టపోయేదేమీ లేదు.. మహా అయితే మీ బానిస సంకెళ్లు పోతాయి అంతే అంటూ మార్క్స్ పిలుపునిచ్చాడు. కానీ, ఈ కొటేషన్‌ను నేను కొంచెం మార్చి చెబుతాను. ప్రపంచ మహిళలు ఏకం కండి.. మీరు కోల్పోయేదేమీ లేదు.. సంకెళ్లు తప్ప అని చెబుతాను’ అని అన్నారు.
తొమ్మిది మంది నూతన న్యాయమూర్తులు, సీజేను సన్మానించడానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులను సీజే ఎన్‌వీ రమణ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థలో 50శాతం రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరమున్నదని తెలిపారు. ‘అది మీ హక్కు. న్యాయవ్యవస్థలో, లా కాలేజీల్లో మహిళలు 50శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేయవచ్చు. ఇది వేల ఏళ్లుగా సాగుతున్న అణచివేత. మన న్యాయవ్యవస్థలో 50శాతం రిజర్వేషన్లు ఉండాలి. దిగువ న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తులు 30శాతం లోపే ఉన్నారని, హైకోర్టుల్లో 11.5శాతం న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల్లోనూ 11 నుంచి 12శాతం న్యాయమూర్తులున్నారు’ అని పేర్కొన్నారు.
‘దేశంలో సుమారు 17 లక్షల న్యాయవాదులున్నారు. ఇందులో మహిళా న్యాయవాదులు 15శాతమే. స్టేట్ బార్ కౌన్సిళ్లలో ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు రెండు శాతమే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఇప్పటికీ ఒక మహిళా ప్రతినిధి లేకపోవడమేమిటి?’ అని సీజే ఎన్‌వీ రమణ అడిగారు. ఈ లోపాలను వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు. ఈ రోజు ప్రపంచ కూతుళ్ల దినోత్సవమని పేర్కొన్నారు. ‘మీ అందరికీ హ్యాపీ డాటర్స్ డే. అఫ్ కోర్స్ ఇది అమెరికన్ ట్రెడిషన్. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని మంచి విషయాలను మనమంతా వేడుక చేసుకుంటాం కదా’ అని తెలిపారు.