పెళ్లి వేడుకకు గెస్ట్‌గా వెళ్లిన మహిళ.. రూ. 20 లక్షల నగలతో పరార్

By Mahesh KFirst Published Dec 4, 2022, 2:52 PM IST
Highlights

జార్ఖండ్‌లో జరిగిన ఓ పెళ్లిలో అతిథిగా వచ్చిన మహిళ రూ. 20 లక్షల విలువైన నగలను దొంగిలించింది. అతిథులు అంతా పెళ్లి వేడుకలో బిజీ అయ్యాక ఈ చోరీ జరిగింది.
 

రాంచీ: జార్ఖండ్‌లో ఓ పెళ్లి ఘనంగా చేశారు. ఈ వేడుకకు అతిథిగా ఓ మహిళ వెళ్లింది. అందరూ పెళ్లి తంతులో మునిగిపోయి ఉండగా ఆమె మాత్రం చోరీకి ప్లాన్ అమలు చేసింది. అందరూ బిజీగా ఉండగా ఆమె రూ. 20 లక్షల విలువైన నగలతో ఉడాయించింది. ఈ ఘటన రాంచీలోని మోరబాడి ఏరియాలో చోటుచేసుకుంది.

రాంచీలో ఓ కుటుంబం వారి బిడ్డ కోసం గ్రాండ్‌గా పెళ్లిని నిర్వహించింది. ఆ పెళ్లికి ఓ మహిళ అతిథిగా వెళ్లింది. అప్పుడే పెళ్లి కొడుకును ఊరేగింపుగా తీసుకువచ్చారు. దీంతో కాబోయే అల్లుడు పెళ్లి మంటపానికి రావడంతో కుటుంబం అంతా బిజీ అయింది. బంధువులు అందరూ ఆ ఊరేగింపులో భాగమైంది. ఇదే అదునుగా చూసిన ఆ మహిళ అక్కడ నగల పై కన్నేసింది. దుపట్టా కింద దాచుకుని బయట పడింది.

ఊరేగింపు, పెళ్లి తంతు తర్వాత బంధువుల మళ్లీ తమ గదుల్లోకి వచ్చిన తర్వాత నగలను మరోసారి చూసుకున్నారు. కానీ, అక్కడ రూ. 20 లక్షల విలువైన నగలు, మరికొంత నగదు కనిపించకుండా పోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పెళ్లి వేడుక జరుగుతుండగానే ఓ మహిళ దుపట్టా కింద నగలను దాచి బయటకు వెళ్లుతూ కనిపించింది. ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు.

Also Read: ట్రైన్ ఇంజిన్లు, బ్రిడ్జీలను దొంగిలిస్తున్న బిహార్ చోరులు.. పక్కా ప్లాన్‌తో దొంగతనాలు

ఈ ఘటనపై ఎస్పీ నౌషద్ ఆలం స్పందించారు. నగలు దొంగిలించిన మహిళను గుర్తించామని చెప్పారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని తెలిపారు.

ఇలాంటి ఘటనలు ఇదే తొలిసారి కాదు. రాంచీలో ఓ ప్రతిష్టాత్మక క్లబ్‌లో ఎంపీ నిర్వహించిన పెళ్లి వేడుకలోనూ చోరీ జరిగింది. దొంగిలించిన విధానం ఇదే తరహా జరిగింది. ఆ పెళ్లిలోనూ దొంగలు అతిథులుగా వచ్చి నగలు ఎత్తుకెళ్లారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువే చోటుచేసుకుంటాయని కొందరు నిపుణులు చెప్పారు.

click me!