బీజేపీలో చేరను.. అవసరమైతే బయటి నుంచే మద్దతిస్తా: గుజరాత్‌లో ఆప్ ఎమ్మెల్యే

By Mahesh KFirst Published Dec 11, 2022, 7:13 PM IST
Highlights

గుజరాత్ ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయాన్‌ చుట్టూ ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరుతున్నారని, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ భయాన్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలను పూర్తిగా చల్లార్చలేవు. బీజేపీలో చేరనని చెబుతూనే అవసరమైతే బయటి నుంచే ఆ పార్టీకి మద్దతు ఇస్తా అని వివరించారు.
 

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఆప్‌కు కొత్త సమస్య తలెత్తుతున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ అఖండ విజయం సాధించిన గుజరాత్ రాష్ట్రంలో ఆప్ తన ఐదుగురు ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం సవాలుగా మారే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఓ ఆప్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారని, వారితో టచ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఆప్ ఎమ్మెల్యేల పరిస్థితిపై చర్చ మొదలైంది. అయితే, ఆ ఆప్ ఎమ్మెల్యే అలాంటి వార్తలను ఖండించారు. తాను బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేస్తూనే బీజేపీకి అవసరమైతే అంటే.. ప్రజలు కోరుకుంటే బయటి నుంచే మద్దతు ఇస్తా అని వివరించారు.

ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన విలేకరుల ముందుకు వచ్చి తన వైఖరిని స్పష్టం చేశారు. 

‘నేను బీజేపీలో చేరను. నేను ప్రజలను వారికి కావాల్సిందేమిటో అడుగుతాను. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాను’ అని భూపత్ భయాని తెలిపారు. అయితే, ఫార్మల్‌గా బీజేపీలో చేరకుండా ఆ పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తా అని ఆయన సంకేతాలు ఇచ్చారు. 

Also Read: 15 స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు.. 126 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన ఆప్ ..

విశ్వదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్ పై భయాని గెలుపొందారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీకి దీటుగా ఆప్ పోటీ ఇస్తుందనేంతగా క్యాంపెయిన్ చేశారు. ప్రధాని మోడీ సహా బీజేపీ విధానాలను ఆయన విమర్శించారు. ఆప్ సరైన ప్రత్యామ్నాయం అని, ఆప్‌కే అధికారం కట్టబెట్టాలని కోరారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలకు గాను 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 17 సీట్లను, ఆప్ 5 సీట్లను కైవసం చేసుకుంది.

click me!