2024 ఎన్నికలకు థర్డ్ ఫ్రంట్ ఉండదు.. కానీ.. : నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Dec 11, 2022, 5:16 PM IST
Highlights

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు మూడో ఫ్రంట్ ఉండదని.. వచ్చేసారి ఏర్పాటు చేసేదే ప్రధాన ఫ్రంట్ అని నితీష్ కుమార్ అన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు మూడో ఫ్రంట్ ఉండదు.. వచ్చేసారి ఏర్పాటు చేసేదే ప్రధాన ఫ్రంట్ అని నితీష్ కుమార్ అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు చేతులు కలపడానికి అంగీకరిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించవచ్చని ఆయన అన్నారు. ఆదివారం తన పార్టీ జనతాదళ్ (యునైటెడ్) ప్లీనరీ సెషన్‌లో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో ఉన్నప్పటికీ తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పనిచేసిందని ఆరోపించారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అసంతృప్తికరమైన పనితీరుకు అప్పటి కూటమి భాగస్వామి బీజేపీ కారణమని విమర్శించారు. 2005 లేదా 2010 అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ తమ పార్టీ తక్కువ సీట్లు గెలవలేదని వారికి గుర్తు చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. 2020లో పెద్ద సంఖ్యలో తమ పార్టీ అభ్యర్థుల ఓటమిపై బాధపడినట్టుగా తెలిపారు.  ఏ పార్టీ పేరు చెప్పకుండానే తన మాజీ మిత్రపక్షంపై విరుచుకుపడ్డారు. అయితే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి నిరాకరించానని.. అయితే బీజేపీ పట్టుబట్టడంతో అంగీకరించినట్టుగా చెప్పారు. 

‘‘కానీ బీహార్‌కు (కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుండి) ఏమీ రాలేదు. ప్రత్యేక హోదా డిమాండ్ అంగీకరించబడలేదు. ఆయన (ప్రధాని నరేంద్ర మోడీ) బ్రిటీష్ రాజుల నుంచి సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి చెందినవారు. పేదలను అభివృద్ధి చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు’’ అని నితీష్ కుమార్ అన్నారు. 

బీజేపీని వ్యతిరేకించే పార్టీలు చేతులు కలపడానికి అంగీకరిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. దానిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే నిర్ణయం మాత్రం ఆ పార్టీల ఇష్టమేనని అన్నారు. బీజేపీ వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకతాటిపైకి వస్తే.. ఆ సమూహం భారీ మెజారిటీకి హామీ ఇవ్వగలదని తాను విశ్వసిస్తున్నట్టుగా చెప్పారు. 

click me!