గుజరాత్ సీఎంగా రేపు మధ్యాహ్నం భుపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం.. మోడీ, అమిత్ షాల హాజరు

By Mahesh KFirst Published Dec 11, 2022, 5:52 PM IST
Highlights

గుజరాత్ ముఖ్యమంత్రిగా భుపేంద్ర పటేల్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అహ్మదాబాద్‌లో కొత్త సచివాలయం దగ్గర నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
 

న్యూఢిల్లీ: గుజరాత్ సీఎంగా వరుసగా రెండో సారి భుపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం గాంధీనగర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరుకాబోతున్నట్టు బీజేపీ నేతలు ఆదివారం తెలిపారు.

గాంధీనగర్‌లో కొత్త సచివాలయం దగ్గరలోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భుపేంద్ర పటేల్ ప్రమాణం తీసుకుంటారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భుపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయిస్తారు. 

భుపేంద్ర పటేల్‌తోపాటు మంత్రులుగా మరికొందరు నేతలు ప్రమాణం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు కాను దేశాయ్, రాఘవ్‌జీ పటేల్, రుషికేశ్ పటేల్, హర్ష్ సంఘవి, శంకర్ చౌదరి, పూర్ణేశ్ మోడీ, మనీషా వాకిల్, రమన్‌లాల్ వోరా, రమన్ పట్కర్‌లకు మంత్రి బెర్తులు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

Also Read: గత రికార్డులను బద్దలు కొడుతూ.. అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ.. కలిసొచ్చిన అంశాలేంటీ?

ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో బీజేపీ వరుసగా ఏడోసారి విజయాన్ని నమోదు చేసింది. 182 స్థానాల అసెంబ్లీలో 156 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. కాగా, కాంగ్రెస్ 17స్థానాలు, ఆప్ 5 స్థానాలను గెలుచుకున్నాయి.

click me!