
న్యూఢిల్లీ: అమెరికా ఎప్పట్లాగే భారత్‌కు సహాయం కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) చైనా సరిహద్దులో భారత్‌కు అండగా నిలుస్తుందని వివరించింది. అమెరికా చట్టసభ్యులకు టాప్ అమెరికన్ అడ్మైరల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా, భారత్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నదని తెలిపారు. సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ ముందు ఈ విషయం స్పష్టం అయింది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో మిలిటరీ స్టేటస్‌పై మాట్లాడుతుండగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ అడ్మైరల్ జాన్ అక్విలినో.. సెనేటర్ గ్యారీ పీటర్స్‌కు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వంతో అమెరికాకు ఉన్న సంబంధాన్ని వెల్లడించగలరని, ఈ రెండు దేశాల మధ్య భద్రత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఏం చేయాల్సి ఉన్నదని సెనేటర్ గ్యారీ పీటర్స్ అడిగారు.
ఈ విషయంపై తమకు ఏ ఆందోళనలూ లేవని అడ్మైరల్ అక్విలినో తెలిపారు. ఇండియాతో అమెరికాది అద్భుతమైన సంబంధం అని వివరించారు. మిలిటరీ టు మిలిటరీ సంబంధాలు ఎన్నడూ లేనంత గాఢంగా ఉన్నాయని తెలిపారు. ఈ సంబంధాలను ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఈ సంబంధాన్ని కొనసాగించడానికి అమెరికా ఏం చేస్తుంది? ఎప్పట్లాగే సమాచారాన్ని పంచుకోవడం, అవసరమైన ఆయుధాలను అందించి సహకరించడం, ముఖ్యంగా ఎల్‌ఏసీలో భారత్‌కు అవసరమైన పరికరాలు అందివ్వడం, ఆ రీజయన్‌లో కలిసి పనులు నిర్వహించుకోవడం కొనసాగిస్తామని తెలిపారు.
లడాఖ్‌లో ఇరు దేశాల సరిహద్దు మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలను తొలగించుకోవడానికి ఇండియా, చైనా దేశాలు శుక్రవారం మరో దఫా ఉన్నత స్థాయి శాంతి చర్చలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2020 మే 5వ తేదీన ప్యాంగ్యాంగ్ సరస్సు తీరంలో ఇండియా, చైనా మిలిటరీ బలగాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలతో సరిహద్దు వెంట ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి శాంతి చర్చలు జరుగుతున్నాయి.
భారతదేశం పట్ల చైనా తీరు ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ గత నెల అన్నారు. చైనా, భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు అంశాలపై కీలక వ్యాఖ‍్యలు చేశారు. చైనాతో భారత్ సమస్యలు ఎదుర్కొంటోందని, భారత్ తో చైనా చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తుందనీ, ఈ కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు చాలా క్లిష్ట దశలో ఉన్నాయనీ, భారత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. గతంలో కూడా జైశంకర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC) 2022 ప్యానెల్ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. 45 సంవత్సరాలుగా ఎలాంటి సరిహద్దు సమస్యలూ లేవని, శాంతి యుతంగా, సుస్థిరంగా సరిహద్దు నిర్వహణ జరిగిందని,1975 నుండి సరిహద్దులో ఎలాంటి సైనిక మరణాలు లేవనీ, కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని, వాస్తవ నియంత్రణ రేఖ విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలను చైనీయులు ఉల్లంఘిస్తున్నారని జైశంకర్ విరుచుకుపడ్డారు.