UP Elections 2022: భార్యపై పోటీకి భర్త సై.. టికెట్ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్న బీజేపీ

By Mahesh KFirst Published Jan 25, 2022, 7:28 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఒకే స్థానం నుంచి భార్య, భర్త పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీ బీజేపీ యూనిట్ ఉపాధ్యక్షుడు దయా శంకర్, ఆయన భార్య, ప్రస్తుత మంత్రి స్వాతి సింగ్‌లు సరోజిని నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరోజిని నగర్ నుంచి స్వాతి సింగ్ గెలిచారు. తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కాగా, ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలా? అని బీజేపీ కిందామీద పడుతున్నది. త్వరలోనే దీనిపై బీజేపీ నాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. 
 

లక్నో: ఒక స్థానం నుంచి ఎంతో మంది పోటీ చేస్తారు. అదే స్థానం నుంచి ఒకే పార్టీ నుంచీ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతుండేవారూ ఎక్కువ మందే ఉండొచ్చు. కానీ, ఒకే పార్టీకి చెంది.. ఇద్దరూ కీలక పదవుల్లో ఉన్న భార్య, భర్త ఒకే స్థానం నుంచి పోటీ చేస్తామని పట్టుబట్టడం మాత్రం చాలా అరుదు. ఈ చిక్కు సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎదురైంది. అదీ బీజేపీ(BJP)కే పరిస్థితి ఎదురైంది. దీంతో భార్య, భర్త(Wife and Husband)లో ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలా? అని మదనపడుతున్నది. దీనిపై పార్టీ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP Elections)లో బీజేపీ ఈ విచిత్ర సమస్య ఎదుర్కొంటున్నది.

లక్నోలోని సరోజిని నగర్‌లో ఈ వింత సమస్య ముందుకు వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరోజిని నగర్ నుంచి పోటీ చేసి దయా శంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో దయా శంకర్ బీఎస్పీ చీఫ్ మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీఎస్పీ నేతలూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ సరిగ్గా ఉపయోగించుకుంది. ఆ సీటు నుంచి స్వాతి సింగ్ గెలుపొందారు. బీఎస్పీ చీఫ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను దయా శంకర్ సింగ్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకు మళ్లీ పార్టీలోకి తీసుకుంది.

ప్రస్తుతం మంత్రి స్వాతి సింగ్ భర్త దయా శంకర్ సింగ్ రాష్ట్ర బీజేపీ యూనిట్ ఉపాధ్యక్షుడు. ఓబీసీ మోర్చా ఇంచార్జ్. అయితే, వీరిద్దరూ సరోజిని నగర్ నుంచి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. భార్య, భర్త ఇద్దరూ ఈ పోటీపై రాజీకి రావడం లేదని తెలుస్తున్నది. ఈ అంశంపై మాట్లాడటానికి వారిద్దరూ అందుబాటులోకి రాలేదు. అయితే, వారిద్దిరిలో ఎవరికో ఒకరికి పార్టీ టికెట్ ఇస్తామని పార్టీ నేతలు చెప్పారు. త్వరలోనే ఈ అంశంపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

సరోజిని నగర్ నియోజకవర్గానికి నాలుగో విడతలో ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగానే మంత్రి స్వాతి సింగ్ తన హోర్డింగ్‌లను నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. తనకే ఓటు వేయాల్సిందిగా కోరుతూ హోర్డింగులు పెట్టారు. కాగా, అదే నియోజకవర్గంలో భర్త దయా శంకర్ సింగ్ కూడా ఇదే విధంగా హోర్డింగ్‌లు పెట్టారు. దీంతో ప్రజలు ఒక్కసారిగతా ఖంగు తిన్నారు.

ప్రతిపక్ష శిబిరాల నుంచి బీజేపీలోకి నేతలను ఆహ్వానించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న బీజేపీ కమిటీలో దయా శంకర్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ చిన్న కూతురు అప్నా యాదవ్‌ను బీజేపీలోకి తీసుకోవడంలో దయా శంకర్ సింగ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. 

ఈ రాష్ట్రంలో గట్టి పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీకి మధ్యే కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీఎస్పీలూ పోటీలో ఉన్నా.. నామమాత్రంగానే పోటీ ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. 

click me!