విచిత్ర పెళ్లి: లవ్ మ్యారేజీ చేసుకుని భర్తపైనే రేప్ కేసు.. వారిద్దరి కుటుంబాలు ఏం చేశాయంటే?

By Mahesh KFirst Published Mar 27, 2023, 6:36 PM IST
Highlights

బిహార్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెద్దలకు తెలియకుండా ప్రేమికులు ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తపైనే ఆమె అత్యాచార ఆరోపణలు చేసింది. భర్త జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత ఉభయ కుటుంబాలకు విషయం తెలిసింది. వరుడిని బెయిల్ పై తెచ్చి మరోసారి పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు.
 

న్యూఢిల్లీ: పెళ్లి అంటే వరుడికైనా, వధువుకైనా కొంత నర్వస్ ఉండటం సహజం. కానీ, బిహార్‌కు చెందిన రాహుల్ కుమార్ పరిస్థితిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టమే. ఆయన ఇష్టపడ్డ అమ్మాయిని ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఆమెనే అతనిపై అత్యాచారం ఆరోపణలు చేసింది. భార్య ఫిర్యాదుతో రాహుల్ పై రేప్ కేసు నమోదైంది. పోలీసులు రాహుల్‌ను జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలకు విషయం తెలిసింది. ఆ ఇరు కుటుంబాలే సయోధ్యకు వచ్చి పెళ్లి చేయాలనే నిశ్చయానికి వచ్చాయి. జైలుకు వెళ్లిన రాహుల్‌ను బెయిల్ పై విడుదల చేయించుకువచ్చి మరీ ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే జైలుకు వెళ్లిన రాహుల్.. మళ్లీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.

పశ్చిమ చంపారన్ మాచర్‌గావ్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ ఇంజినీరింగ్ చదివాడు. ఓ సారి కుటుంబంతో కలిసి లక్నోలోని సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడే రాహుల్‌కు యూపీలోని కప్తంగంజ్‌కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. బిహార్‌లో గోపాల్‌గంజ్‌లోని తావే దుర్గా గుడిలో రహస్యంగా వారు పెళ్లి చేసుకున్నారు. 

దాంపత్య జీవితం మొదలు పెట్టిన తర్వాత కాజల్ ఆరోగ్యం క్షీణించడంతో రాహుల్ మార్చి 5న ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఆమెకు బ్లీడింగ్ ఎక్కువ కావడంతో డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు హాస్పిటల్ వచ్చారు. రాహుల్ పై కాజల్ అత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు రేప్ కేసు ఫైల్ చేసి రాహుల్‌ను జైలుకు తీసుకెళ్లారు. ఈ విషయం రాహుల్, కాజల్ కుటుంబానికి తెలిసింది. 

Also Read: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసు, ఏప్రిల్ 22 వరకు డెడ్‌లైన్

దీనిపై ఆ రెండు కుటుంబాల మధ్య చర్చ జరిగింది. చివరకు వారిద్దరికీ పెళ్లి చేయడానికి అంగీకరించారు. కానీ, అప్పటికే రేప్ కేసులో రాహుల్‌ జైలుకు వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యలు గోపాల్‌గంజ్ సీజీఎం కోర్టులో దరఖాస్తు వేశారు. వారిద్దరికీ పెళ్లి చేయడానికి బెయిల్ ఇవ్వాలని, ఇద్దరూ మేజర్లు అని వివరించారు.

దీంతో కోర్టు అనుమతించింది. రాహుల్‌కు నాలుగు గంటలు బెయిల్ ఇచ్చింది. అదే తావే దుర్గా ఆలయంలో మంత్రోచ్ఛరణల మధ్య వారికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. థావేవాలి కోర్టు వారిని భార్య భర్తలుగా నిర్దారించింది. ఈ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

click me!