తన భార్య ఆలయాలకు వెళ్లడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏమన్నారంటే?

By Mahesh K  |  First Published Oct 22, 2023, 4:40 PM IST

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన భార్య గుడికి వెళ్లడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఆధ్యాత్మికతకు, మత విశ్వాసాలు కలిగి ఉండటానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన భార్య ఎన్నో గుళ్లకు వెళ్లుతుంటారని, తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని వివరించారు. ఆలయాలకు వెళ్లితే తప్పేంటనీ ప్రశ్నించారు.
 


హైదరాబాద్: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆధ్యాత్మిక, ఆలయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఆధ్యాత్మికతను వ్యతిరేకించదని స్పష్టం చేశారు. ప్రజలు ఆలయాలకు వెళ్లడం, భక్తిని కలిగి ఉండటం వారి అభిమతం అని, ఇందులో తాము ఎన్నడూ జోక్యం చేసుకోలేదని వివరించారు. అంతేకాదు, ఆలయాల్లో పూజలకు సంబంధించిన హక్కులను డీఎంకే పోరాడి సాధించిందని తెలిపారు.

డీఎంకే ఐటీ విభాగం నిపుణుల సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన భార్య దుర్గ ఆలయాలకు వెళ్లే విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తన భార్య ఆలయాలకు వెళ్లగానే ఫొటోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో తప్పుడు అభిప్రాయాలను కల్పించేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదిగో చూడండి.. స్టాలిన్ సతీమణి ఆలయానికి వెళ్లుతున్నదని కామెంట్లు పెడుతుంటారని అన్నారు.

Latest Videos

Also Read : నవరాత్రి ఉత్సవాల్లో 24 గంటల్లోనే 10 మంది గుండెపోటుతో మృతి

తన భార్య దుర్గ ఎన్నో ఆలయాలకు వెళ్లుతారని, అది ఆమె ఇష్టం అని స్టాలిన్ వివరించారు. ఆమె ఆలయాలకు వెళ్లడాన్ని తాను అభ్యంతరపెట్టనని తెలిపారు. తాను ఎప్పుడూ ఆలయాలకు వెళ్లవద్దని అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు ఆమె గుడికి వెళ్లితే తప్పేంటీ అని కూడా ప్రశ్నించారు.

కరుణానిధి పరాశక్తి సినిమా సంభాషణలో ఒక డైలాగ్ రాశారని, ఆలయాలు వద్దనేది తమ అభిమతం కాదని, కానీ, ఆ గుడులు దుష్టులకు ఆశ్రయాలుగా మారవద్దు అనేదే తమ లక్ష్యం అని పేర్కొన్నారని స్టాలిన్ వివరించారు. ఈ సూత్రం ఆధారంగా ద్రవిడ పాలన అందిస్తున్నామని చెప్పారు. డీఎంకే అధికారంలో ఉన్నా.. లేకపోయినా సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాబట్టి, డీఎంకే పై వచ్చే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించి వాస్తవ వివరణలు ప్రజలకు అందించాలని సీఎం స్టాలిన్ సోషల్ మీడియా నిపుణులను కోరారు. బీజేపీ కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ వారు ఈ పని చేస్తారని పేర్కొన్నారు.

click me!