మహువా మొయిత్రాపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ బహిష్కరణ వేటు వేయాలని సిఫారసు చేసింది.ఈ సిఫారసుల ఆధారంగా మహువా లోక్ సభ సభ్యత్వం రద్దైంది.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఆమె లోక్ సభ సభ్యత్వం కూడ రద్దైంది. ఈ మేరకు శుక్రవారం నాడు లోక్ సభ నిర్ణయం తీసుకుంది.
అదానీపై లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు గాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యాపారవేత్త హీరానందానీ నుండి డబ్బులు తీసుకున్నారని ఆమెపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు.
2023 అక్టోబర్ 15న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు.ఈ అంశం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. మహువాకు హీరానందానీ ఖరీదైన బహుమతులు, ఎన్నికల సమయంలో ఆర్ధిక సహాయం కూడ చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీకి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సిఫారసు చేశారు.
నగదుకు ప్రశ్నలు అడిగారాని ఆమెపై ఆరోపణలపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విచారణ నిర్వహించింది. ఈ ఆరోపణలను మహువా మొయిత్రా తోసిపుచ్చారు. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విచారణకు కూడ ఆమె హాజరయ్యారు. పార్లమెంట్ లో మహువా వేసిన ప్రశ్నల్లో అత్యధికంగా హీరానందానీ కంపెనీ ప్రయోజనాల కోసం వేశారని ఆమెపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను హీరానందానీ గ్రూప్ సంస్థలు కూడ తీవ్రంగా ఖండించాయి.
పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ కూడ మహువా మొయిత్రా విషయమై మూడు అంశాలపై లోతుగా విచారణ నిర్వహించింది. పార్లమెంట్ సభ్యుడి కాని వ్యక్తికి ఎంపీకి చెందిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు ఇవ్వడాన్ని ఎథిక్స్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. హీరానందానీకి తన పార్లమెంట్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చి ప్రశ్నలను అప్ లోడ్ చేయించారని మహువా పై ఆరోపణలున్నాయి.మహువాపై ఆరోపణలు నిజమని ఎథిక్స్ కమిటీ తేల్చింది. కమిటీలోని ఆరుగురు సభ్యులు మహువా మొయిత్రాపై చర్యలు తీసుకొనేందుకు సిఫారసుకు అనుకూలంగా ఓటు చేశారు. మిగిలిన ఆరుగురు సభ్యులు మాత్రం ఈ సిఫారసును వ్యతిరేకించారు.
మహువా మొయిత్రా విదేశీ పర్యటనల గురించి కూడ ఎథిక్స్ కమిటీ ప్రస్తావించింది. మహువా మొయిత్రా విదేశీ పర్యటనలకు సంబంధించిన నివేదికలను కూడ ఈ నివేదికలో పొందుపర్చారు. మరో వైపు హీరానందానీని కూడ ఎథిక్స్ కమిటీ ప్రశ్నించాలని మహువా మొయిత్రా కోరారు. ఎథిక్స్ కమిటీ విచారణలో తనను చెత్త ప్రశ్నలు అడిగారని కూడ ఆమె గతంలోనే ఆరోపించారు.
డిసెంబర్ 8వ తేదీన లోక్ సభలో ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ కుమార్ సోంకర్ లోక్ సభ స్పీకర్ కు నివేదికను సమర్పించారు.అనైతికంగా వ్యవహరించిన మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటేయాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.
also read:టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నగదుకు-ప్రశ్న ఆరోపణలు: లోక్ సభ సభ్యత్వం రద్దు
ఈ నివేదిక ఆధారంగా లోక్ సభలో విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్ష పార్టీల నిరసనల మధ్యే మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఆమె లోక్ సభ సభ్యత్వం కూడ రద్దైంది. రాజకీయ కారణాలతోనే మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని టీఎంసీ ఆరోపించింది. విపక్ష పార్టీల ఎంపీ లోక్ సభ నుండి వాకౌట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు.