
బీహార్ లో గత 30 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ తోసిపుచ్చారు. ఆయన ఎవరో తనకు తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ ఆచూకీ కూడా తేలీదని చెప్పారు.
ఇటీవల ప్రశాంత్ కిశోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లను విమర్శించారు. వారి హయాంలో బీహార్ లో అభివృద్ధిలో వెనకబడి పోయిందని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల తేజస్వీ యాదవ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీకే మాటలు నిరాధారమైనవని తెలిపారు. ‘‘ ప్రశాంత్ కిశోర్ ప్రకటనకు సమాధానం చెప్పడానికి కూడా అర్థం లేదు. ఇది నిరాధారమైన ప్రకటన. అతని ఆచూకీ నాకు తెలియదు. అసలు ఎవరు అతను ? ఆయన ఇప్పటి వరకు దేనిలోనూ ఒక కారకంగా ఎప్పుడూ లేడు ’’ అని ఆయన అన్నారు.
దేశంలో పౌరసత్వ (సవరణ) చట్టం అమలుపై సీఎం స్పందనపై కూడా తేజస్వీ యాదవ్ మాట్లాడారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీ ఆ బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేసినందుకు విమర్శించారు. సీఏఏ అనేది విధానపరమైన అంశమని, కోవిడ్ నుంచి ప్రజలను రక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆందోళన చెందుతోందని కుమార్ అన్నారు. మహమ్మారి ముగిసిన వెంటనే ఈ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ సీఏఏ-ఎన్ఆర్సీపై మా వైఖరి స్పష్టంగా ఉంది. పార్లమెంటులో మేము దీనిని ఎప్పుడూ వ్యతిరేకించాము. బీహార్ లో ఎప్పుడైనా ఇది త్వరలోనే అమలు చేస్తారని నేను అనుకోవడం లేదు. జేడీయూ పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇచ్చింది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రతీ పార్టీ ఈ విషయంలో తన వైఖరిని ముందుకు తెచ్చింది. జేడీయూ సీఏఏకు అనుకూలంగా ఓటు వేసింది’’ అని తేజస్వీ యాదవ్ మాట్లాడారు.
గత కొంత క్రితం ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై దేశంలో విపరీతమైన చర్చ జరిగింది. కానీ కొన్ని రోజుల సస్పెన్స్ తరువాత ఇందులో వాస్తవం లేదని తెలిసింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ పీకే ట్విట్టర్ వేధికగా క్లారిటీ ఇచ్చారు. అయితే తరువాత ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై కూడా కొంత కాలం తరువాత ఆయన స్పష్టతను ఇచ్చారు. తనకు ఎన్నికల్లో విజయం సాధించాలనే కోరిక లేదని చెప్పారు. తాను బిహార్ అభివృద్దికి కృషి చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే భావసారూప్యత ఉన్నవారితో కలిసి పనిచేసి రాజకీయ వేదికపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
“మీడియాలోని ఒక వర్గంలో ఊహాగానాలు జరుగుతున్నట్లుగా.. నేను ప్రస్తుతం ఏ కొత్త పార్టీని ప్రకటించబోవడం లేదు. బీహార్‌లోని సమస్యలపై అవగాహన ఉన్న దాదాపు 17,000 నుంచి18,000 మందితో మాట్లాడి వారిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది’’ అని పీకే చెప్పారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌ల 30 ఏళ్ల పాలన వల్ల బిహార్ దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. బీహార్ అభివృద్ది చెందాలంటే గతంలో నడిచిన మార్గంలో కాకుండా.. కొత్త దిశ అవసరం ఉందని అన్నారు.