కిక్కు ఎక్కట్లేదు.. కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు: ఎక్సైజ్ కమిషనర్, హోం మంత్రికి మందుబాబుకు ఫిర్యాదు

Published : May 08, 2022, 03:04 PM ISTUpdated : May 08, 2022, 03:17 PM IST
కిక్కు ఎక్కట్లేదు.. కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు: ఎక్సైజ్ కమిషనర్, హోం మంత్రికి మందుబాబుకు ఫిర్యాదు

సారాంశం

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మందుబాబు తనకు కల్తీ లిక్కర్ అమ్మారని, దాని తాగితే కిక్కు ఎక్కట్లేదని ఆరోపించాడు. ఇదే విషయమై ఎక్సైజ్ కమిషనర్, రాష్ట్ర హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేశాడు. తన న్యాయవాదితో కలిసి కన్జ్యూమర్ ఫోరమ్‌లోనూ చీటింగ్ కేసు పెట్టబోతున్నాడు. ప్రూఫ్‌లు రెండు క్వార్టర్ లిక్కర్ బాటిళ్లను భద్రపరిచి పెట్టాడు.  

భోపాల్: మందుబాబుల స్టైలే వేరు. వారెక్కడైనా కాంప్రమైజ్ అవుతారేమో కానీ.. లిక్కర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటారు. టైమ్ అంటే టైమే.. ఏ సెంటర్ అయినా.. తనకు కావాల్సిన బ్రాండ్ లిక్కర్ ఉండాల్సిందే. ఏళ్ల తరబడి తాగుతూ లిక్కర్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా వారు ఇట్టే పసిగట్టేయగలరు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మందుబాబు ఏకంగా అధికారులకు లిక్కర్‌లో నాణ్యత లోపించిందని ఫిర్యాదు చేశాడు. తాను సుమారు 20 సంవత్సరాల నుంచి మద్యం పుచ్చుకుంటున్నానని, ఆ లిక్కర్ టేస్టు, క్వాలిటీ గురించి తనకు స్పష్టంగా తెలుసు అని వివరించాడు. తాను కొనుగోలు చేసిన దుకాణంలో లిక్కర్ బాగాలేదని, నాణ్యత లేదని ఆరోపించాడు. తాను మద్యం కొనుగోలు చేసిన దుకాణంలో లిక్కర్‌ను కల్తీ చేస్తున్నారని ఆ మందుబాబు తెలిపాడు. తాను తన ఫ్రెండ్ ఇద్దరం కలిసి రెండు క్వార్టర్ బాటిళ్ల మద్యాన్ని సేవించామని కానీ, తనకు మత్తు ఎక్కనేలేదేని పేర్కొన్నాడు. అంటే... ఈ లిక్కర్‌ను దారుణంగా కల్తీ చేస్తున్నారని ఆయన ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆయన రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు కూడా ఫిర్యాదు చేశాడు.

ఉజ్జయిన్ జిల్లా బహదూర్ గంజ్ ఏరియా నివాసి లోకేష్ సోథియా ఈ ఫిర్యాదు చేశాడు. ఆయన ఓ ప్రైవేట్ పార్కింగ్ లాట్‌ను ఆపరేట్ చేస్తున్నాడు. ఆయన నాలుగు క్వార్టర్ బాటిళ్లను కొనుగోలు చేశాడు. అందులో రెండు క్వార్టర్ బాటిళ్లను ఆయన తన మిత్రుడితో కలిసి సేవించాడు. కానీ, ఆ మందుతో తనకు మత్తు ఎక్కలేదు. దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఆ మందును ఎగాదిగా పరిశీలించాడు. లిక్కర్ బాటిళ్లలో మందుకు బదులు ఎక్కువగా నీరే ఉన్నదన్న అభిప్రాయానికి వచ్చాడు. దీంతో ఆయన దగ్గర మిగిలిన మరో రెండు క్వార్టర్ బాటిళ్లను జాగ్రత్తగా దాచి పెట్టాడు. వాటిని ప్రూఫ్‌గా చూపి తన ఫిర్యాదును బలపరచాలనుకున్నాడు. 

తాను లిక్కర్ కొనుగోలు చేసే దుకాణం మందుబాబులను మోసం చేస్తున్నదని, తనకు నీళ్లు కలిపిన లిక్కర్ అమ్మారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఏకంగా ఎక్సైజ్ శాఖను ఆశ్రయించాడు. ఉజ్జయిన్ ఎక్సైజ్ కమిషనర్ ఇందర్ సింగ్ దామోర్‌కు, రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఫిర్యాదు చేశాడు. తనకు కల్తీ మద్యాన్ని విక్రయించారని ఆరోపించాడు. 

ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ దామోర్ ధ్రువీకరించాడు. తనకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు జరపాలని తాను అధికారులను ఆదేశించానని వివరించాడు. సోథియా న్యాయవాది నరేంద్ర సింగ్ ధాకడే మాట్లాడుతూ తాము కన్జ్యూమర్ ఫోరమ్‌లో చీటింగ్ కేసు పెడతామని తెలిపాడు. తన క్లయింట్ చాలా ఏళ్ల నుంచి లిక్కర్ తాగుతున్నాడని, ఆయనకు అసలైన మందు, నకిలీ మందుకు మధ్య వ్యత్యాసం తెలుసు అని వివరించాడు.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !