దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు.. ఏ సెంటరైనా ఓకే : సీఎం ఉద్ధవ్ థాక్రేకు నవనీత్ కౌర్ సవాల్

By Siva KodatiFirst Published May 8, 2022, 3:42 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలంటూ ఆమె సీఎంకు సవాల్ విసిరారు. ఏ తప్పు చేశానని తనను జైల్లో పెట్టారని నవనీత్ కౌర్ మండిపడ్డారు. 

మహారాష్ట్రలో స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు (Navneet Rana) ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం నివాసం వద్ద హనుమాన్ చాలీసా పఠించేందుకు యత్నించిన నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బెయిల్‌పై బయటకు వచ్చిన ఈ జంట ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. 

దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని Amravati ఎంపీ... శివసేన అధినేత, Maharashtra CM Uddhav Thackerayకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసినా పర్వాలేదన్నారు. మహిళా శక్తి అంటే ఏంటో థాకరేకు చూపిస్తామని నవ్‌నీత్ రాణా హెచ్చరించారు. తాను ఏ తప్పు చేశానని జైళ్లో పెట్టారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా చదవడం తప్పా అని నవనీత్ కౌర్ నిలదీశారు. Hanuman Chalisa చదవడం నేరమైతే 14 రోజులు కాదు 14 సంవత్సరాలైనా జైలుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

ఇకపోతే.. నవనీత్ రాణా దంపతులు.. ఏప్రిల్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించనున్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. అయితే ప్రధాని మోదీ ముంబై పర్యటన నేపథ్యంలో దానిని విరమించుకుంటున్నట్టుగా నవనీత్ కౌర్ దంపతులు తెలిపారు. అనంతరం  పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

అయితే దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై ముంబై పోలీసులు తమపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూనవనీత్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గత బుధవారం స్పెషల్​ జడ్జి ఆర్​ఎన్​ రోకడే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు రూ. 50,000 పూచీకత్తును సమర్పించాలని బెయిల్ షరతుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మీడియాతో మాట్లాడవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణకు ఆటంకం కలిగించకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, బెయిల్‌ను రద్దు చేసేలాంటి క్రిమినల్ నేరానికి పాల్పడకూడదని తెలిపారు. మరోవైపు వారిని విచారించాలంటే.. 24 గంటల ముందుగా నోటీసులు ఇవ్వాలని పోలీసు శాఖను కోర్టు ఆదేశించింది. 
 

click me!