
Justice B. Sudarshan Reddy: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే చర్చకు తెరపడింది. ఎవరూ ఊహించిన విధంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేని అభ్యర్థిని ప్రతిపక్షకూటమి ఉపరాష్టపతి ఎన్నికల బరిలోకి దించింది. అతడే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy). మంగళవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంపికను ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి ఎవరు? ఆయన బ్యాక్ డ్రాప్ ఏంటీ? అనే విషయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయమయ్యాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
వ్యక్తిగత నేపథ్యం
జస్టిస్ రెడ్డి ఒక ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిలబడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని అకుల మైలారం గ్రామంలో 1946 జూలై 8న జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆయన హైదరాబాద్‌లో చదువుకొని, 1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ సాధించారు.
న్యాయవాదిగా, జడ్జిగా
జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1971లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. అనంతరం న్యాయవాదిగా ప్రారంభించిన కెరీర్‌లో, ఆయన సివిల్, రాజ్యాంగ కేసులపై ప్రాక్టీస్ చేశారు. 1988–90 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, తరువాత కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా సేవలందించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి లీగల్ అడ్వైజర్‌గా కూడా వ్యవహరించారు.
1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పదేండ్లకు అంటే.. 2005లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందిన ఆయన, 2011లో రిటైర్ అయ్యే వరకు అనేక ముఖ్య తీర్పులు ఇచ్చారు. ఆయన రాజ్యాంగం, మానవహక్కులు, సామాజిక న్యాయం, నీతి అంశాలపై దృష్టి సారించిన తీర్పులకు ప్రసిద్ధి చెందారు. ఉదాహరణకు, బ్లాక్ మనీ కేసులపై ఇచ్చిన తీర్పు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు కావడానికి దారితీసింది. అలాగే.. సుప్రీం కోర్టు జడ్జిగా సేవలందించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
లోకాయుక్తగా పదవి
రిటైర్డ్ అయ్యాక గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా బాధ్యతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2013లో నిర్వర్తించారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఏడు నెలల తర్వాత రాజీనామా చేశారు. ఇక 2024 డిసెంబరులో ఆయన హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ (IAMC) శాశ్వత ట్రస్టీగా నియమితులయ్యారు. తెలంగాణతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో చదువుకొని, ఇక్కడే న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.
రాజకీయ వ్యూహం
ఉప రాష్ట్రపతి పోటీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ అభ్యర్థిగా ఇండియా కూటమి నిలబెట్టడం వెనుక ఒక వ్యూహాత్మక నిర్ణయం ఉందనే చెప్పాలి. రాజకీయ రంగానికి దూరంగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన సమగ్రతను నిరూపించిన జస్టిస్ రెడ్డి, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీపడనున్నారు. ఈ ఎన్నిక రాజకీయంగా, భావజాలపరంగా కీలకమైనది. ఆగస్టు 20న ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు వేస్తారని తెలిసింది. ఏవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.
అయితే, ఎన్డీయే కూటమి తమకు పూర్తి మెజార్టీ ఉన్నందున పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఇండియా కూటమి ఈ పోటీ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తాము ఏ అంశంలోనైనా ప్రభావం చూపగలమని సంకేతం ఇచ్చింది. అందువల్ల ఈ ఎన్నిక దేశ రాజకీయాల్లో కీలక ఘట్టంగా మిగిలిపోతుంది. మరో వైపు ఇండియా కూటమి కూడా దక్షిణాది అభ్యర్థిని దించడం ఆసక్తికరంగా మారింది. అలాగే.. తెలుగు అభ్యర్థిని బరిలో దించి, ఇటు బీఆర్ఎస్ ను, అటు టీడీపీ, జనసేన, వైసీపీలను టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.