
Justice Sudarshan Reddy : ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ వాసి. తుషార్ గాంధీ పేరును టీఎంసీ వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించింది. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి టీఎంసీతో సహా అన్ని పార్టీలు అంగీకరించాయి. దీంతో ఇండియా కూటమి ఈ ప్రకటన చేసింది.
ఖర్గే ఇంటిలో జరిగిన సమావేశం తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. అయితే నిన్న (సోమవారం) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి… ఈ చర్చల్లో ఐఎస్ఆర్ఓ మాజీ శాస్త్రవేత్త ఎం. అన్నాదురై పేరు కూడా పరిశీలించారు. కానీ ఎందుకో ఆయన విషయంలో వెనక్కితగ్గిన ఇండియా కూటమి తెలుగు వ్యక్తి,ని బరిలో నిలిపింది. ఎన్డీఏ తరపున సి.పి. రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు.
1946 జూలై 8న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన సుదర్శన్ రెడ్డి 1971లో హైదరాబాద్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. 1988-90 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 1990లో ఆరు నెలలు కేంద్ర ప్రభుత్వ అదనపు సలహాదారుగా పనిచేశారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.