
Droupadi Murmu Profile: రాష్ట్రపతి ఎన్నికలకు(Presidential Elections 2022) NDA తన అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ తన అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ( Droupadi Murmu)పేరును ప్రతిపాదించింది. రాష్ట్రపతి అభ్యర్థి కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు 20 మంది పేర్లను చర్చించిందని, ఆ తర్వాత తూర్పు భారతదేశానికి చెందిన గిరిజన మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనున్నారు. ఈ తరుణంలో Droupadi Murmu Profile ఏంటీ.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో మొదలైంది. ద్రౌపది ముర్ము వివరాలు మీకోసం..
ద్రౌపది ముర్ము జీవితం గురించి చెప్పాలంటే.. ఒడిశాలోని నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేయడం నుండి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ అయ్యే వరకు ఎంతో సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం చేసింది ఈ గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము.
ద్రౌపది ముర్ము 20 జూన్ 1958న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించారు. అత్యంత వెనుకబడిన, మారుమూల జిల్లాకు చెందిన ముర్ము, పేదరికం, ఇతర సమస్యలతో పోరాడుతూ.. తన జీవితాన్ని సాగించింది. ఆమె ఎన్నో ఆవరోధాలను ఆధిరోయించి.. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాల నుండి ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. అనంతరం ఒడిశా ప్రభుత్వ నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించింది.
కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభం..
సంతాల్ కమ్యూనిటీకి చెందిన ముర్ము 1997లో రాయరంగ్‌పూర్ నగర్ పంచాయతీలో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె రాయ్‌రంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2013లో పార్టీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు స్థాయికి ఎదిగారు. ఆమె 2000, 2004 సంవత్సరాల్లో ఒడిశాలోని రాయంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము 2000-2002 మధ్య వాణిజ్యం, రవాణాశాఖ బాధ్యతలను చేపట్టింది. దీంతో పాటుగా.. మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.
ఉత్తమ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డు
2007లో ఒడిశా శాసనసభ ఉత్తమ ఎమ్మెల్యేగా ముర్ముకు నీలకంఠ్ అవార్డును అందించింది. రాయ్‌రంగ్‌పూర్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముర్ము.. 2009లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ బిజెడి గెలిచిన.. రాష్ట్ర ఎన్నికలకు కొన్ని వారాల ముందు బిజెడి బిజెపితో బంధాన్ని తెంచుకున్న తర్వాత కూడా ఆమె అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
వైవాహిక జీవితం ఇలా..
ముర్ము.. శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయిన ముర్ము జీవితం ఎన్నో విషాదాలతో నిండిపోయింది. ఆమె కుమార్తె ఇతిశ్రీని.. గణేష్ హెంబ్రామ్‌ను వివాహం చేసుకున్నారు.
ఎన్నికైన తర్వాత తొలి గిరిజన అధ్యక్షుడు
ఆమె 2000 మరియు 2004 సంవత్సరాల్లో ఒడిశాలోని రాయంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తొలి మహిళ. గవర్నర్‌గా నియమితులైన తొలి మహిళా గిరిజన నేత.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే.. ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతి, రెండవ మహిళా రాష్ట్రపతి అవుతారు. ఇది కాకుండా.. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే.. ఒడిశా నుండి ఎన్నికైన మొదటి అధ్యక్షురాలుగా కీర్తి గడిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె రాజకీయాలు, సామాజిక సేవలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 కాగా, జూలై 18న పోలింగ్ జరుగుతుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.