
‘ఇండియా’ను ఇక నుంచి అధికారికంగా ‘భారత్’ అని పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈరోజు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. భారతదేశం అంటే భారత్ అని, కానీ ఇప్పుడు హఠాత్తుగా ‘భారత్’ అని పిలవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ‘‘భారత రాష్ట్రపతి’’ పేరిట జీ-20 విందు ఆహ్వానంపై తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచానికి మన దేశం ‘ఇండియా’ అని తెలుసని చెప్పారు.
‘‘ఇండియా పేరును మారుస్తున్నారని విన్నాను. గౌరవనీయ రాష్ట్రపతి పేరిట వచ్చిన జీ20 ఆహ్వానంపై భారత్ అని రాసి ఉంది. మన దేశాన్ని భారత్ అంటాం. ఇందులో కొత్తదనం ఏముంది? ఇంగ్లిష్ లో ఇండియా అంటాం... కొత్తగా చేసేదేమీ లేదు. ప్రపంచానికి మనం ఇండియాగా తెలుసు. అకస్మాత్తుగా దేశం పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది’’ అని ఆమె ప్రశ్నించారు. దేశంలో చరిత్రను తిరగరాస్తున్నారని మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆమె మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సీవీ ఆనందబోస్ అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. గవర్నర్ చర్యలు రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేసే ప్రయత్నం అని అన్నారు. గవర్నర్ ఫైనాన్స్ బిల్లులను అడ్డుకోలేరని చెప్పారు. వీటి ఆమోదం కోసం అవసరమైతే రాజ్ భవన్ ఎదుట ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు.
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల పనితీరులో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. యూనివర్సిటీల పనితీరులో గవర్నర్ జోక్యం చేసుకుంటూ పోతే నిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా.. ప్రతిష్ఠాత్మక ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, మకాట్, బుర్ద్వాన్ యూనివర్సిటీ సహా ఏడు యూనివర్సిటీలకు తాత్కాలిక వైస్ చాన్స్ లర్లను గవర్నర్ ఆదివారం రాత్రి నియమించారు.
ఇదిలా ఉండగా.. ఇండియాను ఇక నుంచి భారత్ అని పిలవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో భారత్ అధ్యక్షతన జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా అతిథులను డిన్నర్ కు ఆహ్వానించేందుకు ముద్రించిన పత్రికలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని రాసి ఉంది. ఈ జీ20 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు.