ఈ నేపథ్యంలోనే అసలు ఈ మాల్దీవుల వివాదం ఏమిటి? భారత్ కి, మాల్దీవులకు గొడవ ఎక్కడ మొదలైంది? ప్రధాని నరేంద్ర మోడీపై అంత తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేంటి? మాల్దీవులను బాయికాట్ చేయాల్సినంత సమస్య ఏంటి?
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఆ దేశం. నష్ట నివారణకు మాల్దీవుల ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సమస్య పెరుగుతూనే ఉంది. మాల్దీవులు పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధి. అందమైన బీచ్ లు, సుందరమైన ప్రకృతికి పేరుపడింది. నరేంద్ర మోదీమీద చేసిన వ్యాఖ్యల వివాదంతో పర్యాటకులు మాత్రమే కాకుండా వ్యాపారులు కూడా మాల్దీవుల బహిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఈజ్ హై ట్రిప్ మాల్దీవులకు వెళ్లే విమానాలను రద్దు చేయగా, అదే బాటలో సోమవారం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అన్ని దేశీయ వ్యాపారులు, ఎగుమతిదారులను ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం మానుకోవాలని కోరింది. మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోమవారం అమితాబ్ బచ్చన్ కూడా ప్రధానిమీద చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ట్రెండింగ్ లో బాయ్ కాట్ మాల్దీవ్స్
దీంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మాల్దీవులకు బదులు ఇండియాలో అనేక అందమైన బీచ్ లో ఉన్నాయని.. వాటిలో లక్షద్వీప్ మాల్దీవులకు బదులుగా వెళ్లాలని పలువురు సెలబ్రిటీలు, విమానయాన సంస్థలు, పర్యాటక రంగం పర్యాటకులను కోరుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీపై విపరీతమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల విమాన బుకింగ్‌లను నిలిపేసిన ఈజ్ మైట్రిప్..
ఈ నేపథ్యంలోనే అసలు ఈ మాల్దీవుల వివాదం ఏమిటి? భారత్ కి, మాల్దీవులకు గొడవ ఎక్కడ మొదలైంది? ప్రధాని నరేంద్ర మోడీపై అంత తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేంటి? మాల్దీవులను బాయికాట్ చేయాల్సినంత సమస్య ఏంటి? దీన్ని మాల్దీవుల ప్రభుత్వం ఎందుకు అంతా సీరియస్గా తీసుకుంది? ముగ్గురు మంత్రులపై వేటు వేసేంతగా ఏం జరిగింది?.. ఇంతకీ వారు ప్రధానిపై ఏం వ్యాఖ్యలు చేశారు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. దీని గురించి తెలియాలంటే ప్రధాని మాల్దీవులకు వెళ్ళినప్పటి రోజుకు వెళ్లాలి…
లక్షద్వీప్ లో మోడీ పర్యటన
మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో గతవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. అద్భుతమైన బీచ్లకు లక్ష ద్వీప్ పెట్టింది పేరు. లక్షద్వీప్ కు ఏటా లక్షలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలని.. మరింతగా పర్యాటకులను ఇక్కడికి వచ్చేలా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన చేశారు. అక్కడి బీచ్ లలో సేద తీరారు. నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. బీచ్ లో సేద తీరడమే కాదు..స్నార్కెలింగ్ చేసిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
దీంతో ఒక్కసారిగా లక్షద్వీప్ పేరు మారుమోగిపోయింది. అది ఎక్కడుందో వెతకడం కోసం సోషల్ మీడియాలో సెర్చింగ్ ఎక్కువయింది. అంతటితో ఊరుకోకుండా మాల్దీవ్స్, లక్షద్వీప్ లను పోల్చుతూ నెటిజన్లు చాలామంది పోస్టులు కూడా పెట్టారు. ఇదే మాల్దీవ్స్ లోని కొంతమంది మంత్రుల ఆగ్రహానికి కారణమయ్యింది. లక్షద్వీప్ కు క్రేజ్ పెరిగితే పర్యాటకంతో ఎక్కువగా ఆదాయం వచ్చే మాల్దీవ్స్ కి క్రేజ్ తగ్గుతుందని భావించారేమో. వెంటనే భారత్ ను, లక్షద్వీప్ ను టార్గెట్ చేశారు.
మరియం షియునా అనే మాల్దీవ్స్ మంత్రి ప్రధాని నరేంద్ర మోడీని జోకర్, తోలుబొమ్మ అంటూ ఎక్స్ లో అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. భారత్ కు, ఆవు పేడతో చేసిన లడ్డుకు తేడా లేదంటూ తీవ్రస్థాయిలో తిట్ల పురాణం అందుకున్నారు. మరియం షియునాతో పాటు అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అనే మరో ఇద్దరు మంత్రులు కూడా ఇలాగే ట్వీట్లతో దండెత్తారు. ఇక మాల్దీవ్ ల ఎంపీ జహీద్ రమీజ్ ఒక అడుగు ముందుకు వేసి భారత్ లో హోటల్ రూమ్స్ ఎప్పుడు కంపు కొడుతూ అసహ్యంగా ఉంటాయని అన్నారు. భారత్ ఒక అపరిశుభ్ర దేశం అని.. లక్షద్వీప్ కు మాల్దీవులకు పోలిక ఏంటంటూ తీవ్రస్థాయిలో ట్వీట్లు పెట్టారు.
టూరిజంలో కీలక పరిణామం.. లక్షద్వీప్‌లో టాటా రిసార్ట్స్ ఏర్పాటు..
వెల్లివెత్తిన ఆగ్రహాలు..
భారత్ లోని ఒక ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని భావించడంలో తప్పేం లేదు. దానికి మాల్దీవుల మంత్రులు రెస్పాండ్ అయిన తీరే తీవ్ర అభ్యంతరాలకు, విమర్శలకు దారితీసింది. అనవసరంగా గొడవను పెంచుకున్నట్లయింది. భారత్లో దీనిమీద తీవ్రస్థాయిలో ఆగ్రహా వేషాలు వ్యక్తం అయ్యాయి. మాల్దీవుల్లో ఉన్న భారత రాయబార కార్యాలయం దీన్ని తీవ్రంగా ఖండించింది. రాయబార కార్యాలయం ముందు అధికారులు నిరసన తెలిపారు. ఓ దేశంపై, దేశాధినేతపై అనవసరంగా నోరు జారిన వారి మీద చర్యలు తీసుకోవాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కూడా భారత్ మాల్దీవులకు ఎంతో కీలకమైన దేశమని, ఆర్థిక, సామాజిక రక్షణ రంగాల్లో ఎంతో సాకారం అందించిందని.. ఆ దేశంతో గొడవ మంచిది కాదని సూచించారు.మరోవైపు దీనిపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఢిల్లీలో ఉన్న మాల్దీవుల హై కమిషనర్. ఇబ్రహీం షహీబ్ కు సమన్లు జారీ చేసింది. దీంతో వెంటనే ఆయన హోంశాఖ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారట. పలువురు నెటిజెన్లు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే పిలుపు వైరల్ గా మారింది.
మాల్దీవ్స్ రియాక్షన్
ఈ పరిణామాలు ఊహించని మాల్దింగ్స్ వెంటనే నష్ట నివారణ చర్యలకు తెరలేపింది. భారత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించి, వెంటనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను తొలగించినట్లుగా ప్రకటించింది. వాళ్లు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోమని కూడా చెప్పింది. భారత్ కన్నెర్ర చేస్తే మాల్దీవ్స్ ఎందుకింతగా భయపడుతోందంటే.. మాల్దీవ్స్ లో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది.
మాల్దీవులకు వచ్చే మొత్తం ఆదాయంలో 20 నుంచి 25% పర్యాటక రంగం నుంచే వస్తుంది. అందులో కూడా ఎక్కువ మంది భారతీయులే మాల్దీవులకు వెళుతుంటారు. దీనికి కారణం భారత్ కు సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ద్వీప సముదాయం మాల్దీవులు కావడమే. భారత్ కు దగ్గర ఉండి.. అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందడంతో ఏటా లక్షలాది మంది భారతీయులు మాల్దీవ్స్ కు వెళుతుంటారు. అలా నిరుడు సుమారు రెండు లక్షల మంది, అంతకు ముందు రెండున్నర లక్షల మంది భారతీయులు మాల్దీవ్స్ కి వెళ్లారు.
ఇప్పుడు మంత్రులు చేసిన చిన్న పొరపాటుతో ఈ పర్యాటకమంతా దెబ్బతినే అవకాశం ఉంది. అక్షయ్ కుమార్, అమితాబచ్చన్ లాంటి సినీ ప్రముఖులతో సహా అనేకమంది మాల్దీవ్స్ పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. జాన్ అబ్రహం లాంటి వారైతే లక్షద్వీప్ అందమైన బీచ్ ల ఫొటోలు పెట్టి మరీ ప్రాముఖ్యతను తెలిపారు. సచిన్ టెండూల్కర్ లాంటి వారితో సహా అనేకమంది మాల్దీవుల వ్యవహరాన్ని ఖండించారు. దీంతో మాల్దీవ్స్ వెంటనే నష్ట నివారణకు పూనుకుంది.
ప్రభుత్వం మారడంతో..
భారత్ తో మాల్దీవ్స్ ఎప్పుడూ మంచి స్నేహబంధాలే ఉండేవి. అయితే.. నిరుడు ప్రభుత్వం మారిన తరువాత ఈ వ్యవహారంలో మార్పు వచ్చింది. అంతకు ముందు ఉన్న ఇబ్రహీం మహమ్మద్ సోలి ప్రభుత్వం ఎప్పుడూ ఇండియా ఫస్ట్ నినాదంతోనే ఉంది. ఆ తర్వాత మహమ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అధికారంలోకి వచ్చింది. మహమ్మద్ మయిజ్జూ భారత వ్యతిరేకిగా పేరు. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఇండియా అవుట్ నినాదాన్ని వినిపించారు. అధికారం చేపట్టగానే మాల్దీవుల్లోని ఇండియా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
చైనాతో దోస్తాని..
భారత ప్రభుత్వంతో అంతకుముందు మాల్దీవులు చేసుకున్న పలు ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చైనా మాల్దీవులపై కన్నేసింది. మాల్దీవులు కూడా చైనాతో దోస్తీ కట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే భారత్ను మాల్దీవుల నుంచి పూర్తిగా తరిమేయాలని ఆలోచిస్తుంది. మాల్దీవుల్లో పాగా వేయాలని చూస్తున్న చైనా కూడా అధ్యక్షుడు మయిజ్జూను మచ్చిక చేసుకుంటుంది. ఇందులో భాగంగానే మై జూ చైనా పర్యటన కూడా ముందుగానే డిసైడ్ అయ్యింది. ఈ నివాదం తెరపైకి వచ్చిన తర్వాత మై జూ చైనాకు వెళ్లడం కూడా అందుకే.
ఇప్పుడు భారత్ తో జరిగిన ఈ వివాదం తెరమీదకి రాకపోతే మయిజ్జూ భారత్ పై మరింత దూకుడు పెంచేవారు. భారత్ ను పక్కకు తప్పించి చైనాకు రెడ్ కార్పెట్ పరిచేవారు. తాజా వివాదంతో దీనికి బ్రేక్ పడ్డట్టు అయింది. మాల్దీవుల అభివృద్ధిలో భారత్ పాత్ర తక్కువేం కాదు. అక్కడ పారిశ్రామిక పర్యాటరక రంగాలతో పాటు తాగునీరు విషయంలో కూడా భారత్ మాల్దీవులకు ఎంతో సహాయం చేస్తుంది. దీనివల్లే అక్కడి పాలకులకు భారత్ తో ఫ్రెండ్షిప్ ఇష్టం లేకపోయినా.. వివాదాలు కోరుకోవట్లేదు. ఈ క్రమంలోనే మయిజ్జు తన మంత్రుల మీద వేటు వేశారు. కానీ ఈ వివాదం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరి ఎప్పుడు ఆగుతుందో చూడాలి.