
న్యూఢిల్లీ:అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అయోధ్యలో రామమందిర ఆలయాన్ని ప్రపంచానికి అంకితం చేసే పనులు చివరి దశలో ఉన్నాయి.రామ మందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఈ వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సోమవారంనాడు విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గరుడ, హనుమంతుడు, రామ మందిరం ముఖద్వారం వద్ద ఉన్న ఏనుగు,రామమందిరం లోపలి భాగం, వెలుపలి భాగం, గ్రౌండ్ ఫ్లోర్ అలంకరణతో పాటు రాత్రి పూట ఆలయాన్ని లైట్లతో అలంకరించారు. ఈ వీడియోను ట్రస్ట్ విడుదల చేసింది.
అయోధ్యలో రామ మందిరం సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18న గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.భారత దేశంలోని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు శ్రీరాముని విగ్రహం పొడవు, దాని ప్రతిష్టాపన ఎత్తును రూపొందించారు. ప్రతి సంవత్సరం రామ నవమి రోజున సూర్యభగవానుడు స్వయంగా తన కిరణాలతో శ్రీరాముడి నుదురు తాకుతాడని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.
రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానించారు. బాబ్రీమసీదు కోసం దావా వేసిన ఇక్బాల్ అన్సారీని కూడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రామజన్మభూమి ట్రస్టు కార్యకర్తలు స్వయంగా ఆహ్వానం పలికారని ఇక్బాల్ కూతురు షామా పర్వీన్ తెలిపారు. డిసెంబర్ 30న అయోధ్యలో జరిగిన రోడ్డుషోలో మోడీకి ఇక్బాల్ అన్సారీ పూలతో స్వాగతం పలికారు.