‘అకాయ్’ అంటే అర్థం ఇదే...

By SumaBala Bukka  |  First Published Feb 21, 2024, 12:06 PM IST

 ‘అకాయ్’ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కేవలం గంట వ్యవధిలో ఐదు మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.


సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు మంగళవారం నాడు తమ రెండో సంతానం గురించిన తీపి కబురు తెలిపారు. తమకు మగబిడ్డ పుట్టాడని.. అకాయ్ అని పేరు పెట్టినట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 15న మగబిడ్డ జన్మించినట్లు కోహ్లీ, అనుష్క వెల్లడించారు. 

ఈ విషయాన్ని చెబుతూ...‘ఈ చిన్నారి ఫిబ్రవరి 15న మా ఇంటికి సంతోషాల్ని మోసుకొచ్చాడు. మా కూతురు వామిక తన చిన్నారి తమ్ముడిని ఎంతో సంతోషంగా కుటుంబంలోకి ఆహ్వానించింది. మరో సభ్యుడితో మా కుటుంబం పరిపూర్ణమయ్యింది. మా చిన్నారి అకాయ్ కి మీ అందరి ఆశీర్వాదాలు కూడా కావాలి. ఈ సంతోష సమయంలో మేము కాస్త ప్రైవసీ కోరుకుంటున్నాం. దీన్ని మీరంతా గౌరవిస్తారని, గౌరవించాలని అభ్యర్థిస్తున్నాం.. ఇట్లు ప్రేమతో విరాట్ & అనుష్క" అని విరుష్క జంట సోషల్ మీడియా పోస్ట్‌ చేశారు. 

Latest Videos

ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది. వీరి చిన్నారి పేరు ‘అకాయ్’ మీద చర్చలు జరుగుతున్నాయి. దీని అర్థం గురించి వెతుకుతున్నారు. అయితే, అకాయ్ అనేది.. హిందీ పదం 'కాయ' నుండి వచ్చి ఉండొచ్చు. దీని అర్థం 'శరీరం'. అకాయ్ అంటే తన భౌతిక శరీరం కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అని అర్థం. టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'మెరుస్తున్న చంద్రుడు' అని అర్థం.

ప్రముఖ న్యాయ నిపుణుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూత..

అయితే, ఈ పేరు పెట్టడానికి విరాట్, అనుష్క ఏం ఆలోచించారనేది... వారింకా తెలుపలేదు. మరోవైపు ‘అకాయ్’ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కేవలం గంట వ్యవధిలో ఐదు మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఈ పోస్ట్ చేసిన వెంటనే సినీ పరిశ్రమ, క్రికెట్ ప్రపంచానికి చెందిన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నటుడు రణవీర్ సింగ్ కామెంట్ చేస్తూ దిష్టి తగలకుండా ఉండాలనే ఎమోజీ,  లవ్ సింబల్ లను పెట్టాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని కామెంట్ చేసింది. 

విరాట్ పోస్ట్ మీద ఐపీఎల్ జట్లు కూడా స్పందించాయి. "మోర్ టు ది కింగ్స్ ప్రైడ్! అభినందనలు! @imVkohli @AnushkaSharma," అని చెన్నై సూపర్ కింగ్స్ కామెంట్ చేసింది.

"అనుష్క, విరాట్‌లకు అభినందనలు. RCB కుటుంబంలోని అతి పిన్న వయస్కుడైన అకాయ్‌కు ఘన స్వాగతం. ఇది చాలా సంతోషకరమైన వార్త. భారతదేశం ఈ రాత్రి బాగా నిద్రపోతుంది" అని కోహ్లీ  IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కామెంట్ చేసింది.

విరాట్, అనుష్క డిసెంబర్ 11, 2017 న ఇటలీలో వివాహం చేసుకున్నారు. జనవరి 11, 2021న వారిద్దరికి వామిక పుట్టింది. అయితే, రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి ఈ జంట ఎక్కడా చెప్పలేదు. ఇటీవల దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కోహ్లీ, అనుష్కలు తమ రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడంతో విషయం వెలుగు చూసింది.
 

click me!