తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. రైతు సంఘాలతో నాలుగు దఫాలు కేంద్రంతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు.
న్యూఢిల్లీ: ఎంఎస్‌పీ లేదా కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన మద్దతు సహా ఇతర డిమాండ్ల సాధాన కోసం రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి.ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు చేశారు.అయితే కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఆదివారం నాడు జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు.దరిమిలా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఛలో ఢిల్లీకి ఇవాళ పిలుపునిచ్చారు.
మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు ధాన్యాలను పాత ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేస్తామని సోమవారం నాడు ప్రభుత్వం ఇచ్చిన హామీని రైతు సంఘాలు తిరస్కరించారు. తమ డిమాండ్ల విషయమై ఉదయం 11 గంటల లోపుగా కేంద్రం తమ అభిప్రాయాన్ని చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేకపోతే ఛలో ఢిల్లీ కొనసాగుతుందని చెప్పారు.
ఎ2+ఎఫ్ఎల్+50 శాతం ఫార్మూలా, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.ఎంఎస్‌పీ అనేది పంటల వైవిధ్యాన్ని ఎంచుకొనే వారికి మాత్రమే ఉంటుందని, అంటే మద్దతు ధర కోరుకోవడానికి అర్హులని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన పంటలకే మద్దతు ధర అనే నిబంధనపై రైతు సంఘాలు తిరస్కరించాలని నిర్ణయించుకున్నాయి.
రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య నాలుగు దఫాలు చర్చలు జరిగాయి. ఆదివారం నాడు జరిగిన చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సహా కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కానీ చర్చల్లో పురోగతి లేదు.
రైతులు దాదాపు లక్ష మంది పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేచి ఉన్నారు. గత వారం రోజుల నుండి రైతులు అక్కడే ఉన్నారు. 2020-21లో రైతుల ఆందోళన సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే గతంలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఢిల్లీకి వచ్చే మార్గంలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. హైవేలపై కాంక్రీట్ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. ఘాజీపూర్, టిక్రి, నోయిడా, సింగు తో సహా సరిహద్దు ప్రాంతాల్లో మెటల్, సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. భద్రతను మరింత పటిష్టం చేశారు. ఢిల్లీలో 144 సెక్షన్ కింద బహిరంగ సభలపై నెల రోజుల పాటు నిషేధం విధించారు.
తాము శాంతియుతంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. తమను అణచివేయవద్దని రైతులు కోరుతున్నారు.ప్రభుత్వ రంగ పంటల భీమా పథకం, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలవారీగా రూ. 10 వేల పెన్షన్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరో వైపు గతంలో ఆందోళన సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ను ప్రాసిక్యూట్ చేయాలని రైతులు కోరుతున్నారు.