Manipur Gangrape: మహిళలను నగ్నంగా కొడుతూ పొలాల్లోకి తీసుకెళ్లిన రోజు అక్కడ ఏం జరిగింది?

By Mahesh K  |  First Published Jul 20, 2023, 8:17 PM IST

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డు పై కొడుతూ ఊరేగించారు. ఓ యువతి ప్రైవేట్ పార్టులను బలవంతంగా, అసభ్యకరంగా తడిమిన ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన మే 4వ తేదీన జరిగితే నిన్న బయటికి వచ్చింది. ఇంతకీ ఆ రోజు అక్కడ ఏం జరిగింది?
 


న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వారిపై దాడి చేస్తూ సమీప పొలాల్లోకి కొందరు దుండగులు తీసుకెళ్లుతున్న వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశ ప్రజలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో అందరికీ తెలిసింది. ఈ ఘటనపై సాధారణ ప్రజలే కాదు, పార్లమెంటు, సుప్రీంకోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటన మే 4వ తేదీన రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని కింగ్‌పోప్కి జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మెజార్టీ ప్రజలు మైతేయి తెగకు చెందినవారు. ఆ తర్వాత కుకీ, నాగాలు ఉంటారు. మైతేయి ఇంఫాల్ లోయలో ఉంటారు. అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా మైతేయి ఉంటారు. కొండ ప్రాంతాల్లో కుకీలు ఉంటారు. కుకీలు ఇక్కడ మైనార్టీలు. మైతేయిలకు కూడా మైనార్టీ హోదా ఇవ్వాలనే హైకోర్టు సిఫార్సు తక్షణ కారణంగా ఈ రెండు తెగలకు మధ్య మే 3వ తేదీన హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజధానిలో కుకీ తెగ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. ఈ ఘర్షణలు రాష్ట్రమంతటా కలకలం రేపాయి.

Latest Videos

హింసాత్మక ఘర్షణలు మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ రెండు తెగల మధ్య పూడ్చలేని అగాథం పెరుగుతూ వచ్చింది. బద్ధ శత్రువులుగా చీలిపోయారు. చాలా విషయాల్లో వీరికి ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఆకాశానికి చేరినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఆ అపనమ్మకానికి ఏ నకిలీ వీడియో అయినా సరే ఎదుటి వర్గానికి కాలరాయడానికి సిద్ధంగా ఉండేంత ఉన్మాదం కొందరిలో పెరిగింది.

Also Read: Manipur: పోలీసులు ఆ దాష్టీకాన్ని చేష్టలుడిగి చూశారు: వైరల్ వీడియోలోని బాధిత మహిళల తీవ్ర ఆరోపణలు

పోలీసుల ఎఫ్ఐఆర్, కొన్ని మీడియా కథనాల ప్రకారం, మైతేయి కమ్యూనిటీకి చెందిన ఓ మహిళను అత్యాచారం చేశారన్న ఓ నకిలీ వీడియో మైతేయిలకు చేరింది. మైతేయి కమ్యూనిటీకి చెందిన సుమారు 800 నుంచి 1000 మంది కోంగ్‌పోప్కి జిల్లా బి ఫయనోమ్ గ్రామంలోకి దూసుకెళ్లారు. మైతేయి మూక వస్తున్నట్టు ఆ గ్రామంలోని మైతేయిలు సమాచారం ఇచ్చారు. చాలా మంది ఆ గ్రామం నుంచి పారిపోయారు.

ఇలాగే ఒక తండ్రి, ఆయన 19 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు, మరో ఇద్దరు మహిళలు అడవుల్లోకి పారిపోవడానికి ఉపక్రమించారు. వారు వెళ్లుతుండగా దారి మధ్యలో నాంగ్‌పోక్ సెక్‌మై పోలీసులు కనిపించారు. వారి నుంచి రక్షణ అడిగారు. అంతలోనే అక్కడికి ఈ మూక చేరుకుంది. పోలీసుల కస్టడీ నుంచి మరీ వారిని తమ వైపు లాక్కుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డు పై కొట్టుకుంటూ ఊరేగించారు. వారి ప్రైవేట్ పార్టులను బలవంతంగా తాకారు. కొట్టుతూ సమీప పొలంలోకి తీసుకెళ్లారు. ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు.

తన సోదరికి అడ్డుకోవడానికి 19 ఏళ్ల యువకుడు ప్రయత్నించాడు. కానీ, అధునాతన ఆయుధాలతో ఉన్న ఆ మూక చంపేసింది. ఆయన తండ్రిని కూడా చంపేసినట్టు సమాచారం.

పోలీసులకు ఫిర్యాదు అందగా మే 18వ తేదీనే జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. గుర్తు తెలియని సాయుధ దుండగులపై అపహరణ, గ్యాంగ్ రేప్, హత్య వంటి నేరాల కింద కేసు ఫైల్ చేశారు. మే 21వ తేదీన నాంగ్‌పాక్ సెక్‌మై పోలీసు స్టేషన్‌కు ఎఫ్ఐఆర్ బదిలీ చేశారు. ఈ రోజు నిందితుడు హురే హురెదాస్ మైతేయిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇదే తొలి అరెస్టు.

Also Read: మహిళల నగ్న ఊరేగింపును సుమోటోగా తీసుకున్న సుప్రీం: చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశం

అయితే, మే 4వ తేదీన జరిగిన జులై 19వ తేదీన సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇన్నాళ్లు ఆ ఘటన బయటి ప్రపంచానికి తెలియకుండానే ఉన్నది. ఆ రాష్ట్రంలో మే 3వ తేదీన హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న వెంటనే అదే రోజు నుంచి ఇంటర్నెట్ సేవలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ వీడియో బయటికి రాలేదని అర్థమవుతున్నది.

ఈ ఘటన జరిగి సుమారు 70కి పైగా రోజులు గడిచినా ఇప్పటి వరకు దుండగులపై యాక్షన్ తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

మొదటి నుంచి పోలీసులు మైతేయిలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కుకీలు ఆరోపిస్తున్నారు. 

సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూడా పలుమార్లు కుకీలను దూషిస్తూ మాట్లాడటం కలకలం రేపింది. సీఎం ఎన్ బీరెన్ సింగ్ మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. అందుకే ఆయన సీఎంగా రాజీనామా చేయాలని కుకీ తెగ ప్రజలు, కుకి ఎమ్మెల్యేలూ డిమాండ్ చేశారు.

click me!