
కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలవ్వడంతో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు వాయిస్ పెంచుతున్నాయి. 2024లో బీజేపీ ఓటమికి కర్ణాటక తీర్పు నాంది పలికిందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. త్వరలో జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లను కూడా గెలుచుకోలేకపోవచ్చని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టిన కర్ణాటక ప్రజలకు ఆమె సెల్యూట్ చేశారు.
కాగా.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం మొత్తంగా ప్రతిపక్ష శిబిరంలోనే ఒక కొత్త ఊపిరి ఊదింది. ఆత్మస్థైర్యం దెబ్బతిన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. ఇతర విపక్ష పార్టీల్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిందే ఏకం కావాలనే వాదన అక్కర్లేనిది.. ఇలాంటి వాదనలకు ఓ సమాధానం కూడా ఈ విజయం ద్వారా లభిస్తుంది. బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొని గెలవడం.. బీజేపీ కంటే రెట్టింపు సీట్లను సాధించడం నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. ఇది వరకు తాము ఎదుర్కొన్న ఓటముల్లో ఇదీ ఒకటి అన్నట్టుగా బీజేపీ స్పందిస్తున్నది.
కాంగ్రెస్‌కు ఈ విజయం.. ఈ ఏడాది చివరిలో జరగబోతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటానికి ఒక స్థైర్యాన్ని తప్పక అందించనుంది. కేంద్రంలోని మోడీని, బీజేపీని గద్దె దింపడానికి జైత్రయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభం అన్నట్టుగా కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. నరేంద్ర మోడీ అజేయుడనే ఒక నమ్మకాన్ని ఈ ఫలితాలు బీటలు వారిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వీలైనంత ప్రచారం చేశారు. కానీ, దాని ఫలితం పెద్దగా కనిపించలేదు. మునిగిపోతున్న పడవను మోడీ కూడా కాపాడలేడనే భావన స్థానిక నేతల్లో ఇంకుతున్నది. గతంలో కంటే సుమారు 40 వరకు సీట్లను కోల్పోయింది. కాంగ్రెస్ ఈ నమ్మకాన్ని దెబ్బతీసింది. తనపై అపనమ్మకంతో ఉన్న ఇతర ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ విజయంతో కాంగ్రెస్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వంపై పోరాటంలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్‌దే అని స్పష్టత ఇచ్చింది.
Also Read: NOTA: కర్ణాటకలో ఎన్ని లక్షల మంది నోటాకు ఓటేశారో తెలుసా?
ఈ విజయం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలోనూ గెలుపొందడానికి కాంగ్రెస్‌కు ఉపకరించవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీతో నేరుగా తలపడే పార్టీ కాంగ్రెస్సే. కానీ, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచినా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేం. ఎందుకంటే 2018లోనూ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ, తర్వాతి ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. మోడీ ఛరిస్మాతో 2019 ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. మరి ఈసారి కూడా మోడీ ఛరిస్మా సీట్లను పట్టుకువస్తుందా? అనేదే వేచి చూడాలి. మోడీని ఢీకొట్టడానికి ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి.
అయితే, ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒక అడ్వాంటేజీ ఉన్నది. గతంలో విపక్షాలు ఐక్యం కావాలనే అభిప్రాయాలు, ఆలోచనలు లేవు. ఈ సారి ఆ ఆవశ్యకత వాటికి ఏర్పడింది. ఈ ఐక్యత కచ్చితంగా విపక్షాలకు మేలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో విపక్షాల ఐక్యతకు నాయకత్వం ఎవరు వహిస్తారనే వద్దే కూటమి ఏర్పాటు ఆగిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పట్టుసడలింపులు వచ్చినట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే 2024 లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఐక్యత ఏర్పడుతుంది. దానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. అదెంత సమర్థంగా క్యాంపెయిన్ చేయగలిగిందనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది