Omicron: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల తప్పనిసరి క్వారంటైన్.. నిబంధనలు సవరించిన కేంద్రం

By Mahesh KFirst Published Jan 7, 2022, 5:15 PM IST
Highlights

మనదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ గైడ్‌లైన్స్ సవరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు సవరించింది. ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఇక్కడ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టు చేసుకోవాలి. పాజిటివ్ వస్తే.. ఐసొలేట్ చేస్తారు. మెడికల్ ఫెసిలిటీలో నిబంధనల మేరకు చికిత్స అందిస్తారు. సవరించిన నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్న నేపథ్యంలో.. ముఖ్యంగా అతి వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కేసులూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ గైడ్‌లైన్స్(Travel Guidelines) సవరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా వారం రోజులు హోం క్వారంటైన్‌(Home Quarantine)లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రిస్క్ బేస్డ్ పద్ధతిలో ఈ సవరింపులు చేసింది. కాగా, రిస్క్ కేటగిరీలోని దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు(International Arrivals) కచ్చితంగా బయల్దేరుతున్నప్పుడు అక్కడ కరోనా టెస్టు చేసుకోవాలని, ఇక్కడ కూడా టెస్టు చేసి ఆ రిపోర్టులు పరిశీలించిన తర్వాతే మన దేశంలో విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

రిస్క్ కేటగిరీలోని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మన దేశంలోని ఎయిర్‌పోర్టులో నెగెటివ్ అని వస్తే.. ఎయిర్ పోర్టు విడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. కానీ, వారు కచ్చితంగా వారం పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలి. వారు మన దేశంలో అడుగు పెట్టిన 8వ రోజు ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలి అని సవరించిన ట్రావెల్ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి. కాగా, రిస్క్ కేటగిరీలోని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఇక్కడ కరోనా పాజిటివ్ అని వస్తే.. వారిని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తారు. వారిని నిర్దేశిత కేంద్రంలో ఐసొలేషన్‌లో ఉంచుతారు. స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం, చికిత్స అందిస్తారు. ఆ వెంటనే సదరు పాజిటివ్ పేషెంట్ కాంటాక్టులను వెతుకుతారు. ఆ పేషెంట్‌తో విమానంలో సమీపంగా కూర్చున్న తోటి ప్రయాణికులను, క్యాబిన్ క్రూలను కాంటాక్టులుగా గుర్తిస్తారు.

ఇప్పటి వరకు ఎట్ రిస్క్ కేటగిరీలో 19 దేశాలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి కొత్తగా ఈ జాబితాలో తొమ్మిది దేశాలు చేరిన సంగతి తెలిసిందే.

ఎట్ రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి విమానాల్లో మన దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో రెండు శాతం ప్రయాణికులను ర్యాండమ్‌గా తీసుకుని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత టెస్టు చేస్తారు. ఇక్కడ స్క్రీనింగ్ చేస్తుండగా ప్రయాణికుల్లో లక్షణాలు కనిపిస్తే.. వారిని ఐసొలేట్ చేస్తారు. ఆ తర్వాత ఓ మెడికల్ ఫెసిలిటీకి తరలిస్తారు. ఒకవేళ వారికి కరోనా పాజిటివ్ అని తేలితే.. వెంటనే వారి కాంటాక్టులను వెతుకుతారు.

హోం క్వారంటైన్‌లో ఉన్న ప్రయాణికుల్లోనూ కరోనా లక్షణాలు కనిపిస్తే.. లేదా ఎనిమిదో రోజు కరోనా టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని తేలితే.. వారు వెంటనే సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. సమీపంలోని హెల్త్ ఫెసిలిటీకి సమాచారం ఇవ్వాలి. కాగా, ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రయాణికులు మాత్రం.. ఇక్కడ కరోనా టెస్టు చేసుకుని ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాతే విమానాశ్రయాన్ని విడిచి పెట్టాలి లేదా.. కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాలి. 

గత 24 గంటల్లో 1.1లక్షల కరోనా  కేసులు నమోదయ్యాయి. కరోనాతో 302 మంది కరోనాతో మరణించారు. కరోనా కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగాయి. కరోనా Omicron కేసులు మూడు వేలకు చేరుకొన్నాయి.  శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు India లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో  వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

click me!