
ఇండియా నేడు 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటిందని.. ఇది దేశం సాధించిన గొప్ప ఘనత అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. శుక్రవారం ప్రధాని కోల్‌కత్తాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్ నేడు 150 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ (covid-19 vaccine) డోస్‌లను అందించడంలో ఒక చారిత్రక మైలురాయిని చేరుకుందని అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ తయారీదారులు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఎంతో మంది కృషి వల్లే దేశంలో సున్నా నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ ప్రయాణంలో గొప్ప మైలురాయిని సాధించగలిగిందని ప్రధాని తెలిపారు.
90 శాతం మందికి మొదటి డోసు పూర్తి
దేశంలోని అర్హత కలిగిన వ్యక్తుల్లో ఇప్పటి వరకు 90 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందిందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో (జనవరి 3) నుంచి 15-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం మొదలైందని తెలిపారు. 5 రోజుల్లోనే, 1.5 కోట్ల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ అందించారని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి దాదాపు 11 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి 15 వేలకు పైగా వెంటిలేటర్లు, తొమ్మిది వేలకు పైగా కొత్త ఆక్సిజన్ సిలిండర్లు కేంద్రం అందించిందని అన్నారు. వీటితో పాటు 49 పీఎస్ఏ (PSA) కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు కూడా రాష్ట్రంలో పనిచేయడం ప్రారంభించాయని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా 2.60 కోట్ల మందికి లబ్ది..
దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 17 లక్షల మంది క్యాన్సర్ రోగులతో పాటు 2.60 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మోకాలి ఇంప్లాంట్ల ధరను కూడా తగ్గించిందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. దీని వల్ల దేశంలోని సీనియర్ సిటిజన్లకు ఏడాదికి రూ. 1,500 కోట్లు ఖర్చుకాకుండా సహాయపడిందని తెలిపారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ ద్వారా 12 లక్షల మంది పేదలు ఉచితంగా డయాలసిస్ చేయించుకున్నారని అన్నారు.
క్యాన్సర్ రోగులకు తక్కువ ధరలోనే మందులు
క్యాన్సర్ వ్యాధి నుంచి పేదలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని అన్నారు. దీని కోసం తక్కువ ధరలో మందులు, చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందుల ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాలు చాలా సరసమైన ధరలకు మందులు అందిస్తున్నాయని చెప్పారు. ఈ స్టోర్లలో 50కి పైగా క్యాన్సర్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తాయని అన్నారు. రోగుల అవసరాల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని, 500లకు పైగా మందుల ధరల నియంత్రణ వల్ల ఏటా 3000 కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతోందని ప్రధాని అన్నారు. కరోనరీ స్టెంట్‌ల నియంత్రిత ధరల కారణంగా హృద్రోగులు ప్రతి సంవత్సరం 4500 కోట్లకు పైగా ఆదా చేస్తున్నారని అన్నారు.