
రాష్ట్రపతి కావాలనే కోరిక తనకు లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయానికి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీయే కారణమని ఆరోపించారు. ఆ పార్టీపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గురువారం మాయావతి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నానని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ వదంతులను వ్యాప్తి చేస్తోందని మాయావతి మండిపడ్డారు.‘‘ నేను మళ్లీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని లేదా దేశానికి ప్రధాని కావాలని కలలు కంటాను. కానీ రాష్ట్రపతిని కావాలని అనుకోను. యూపీలో బీజేపీ విజయానికి సమాజ్ వాదీ పార్టీయే కారణం. యూపీ సీఎం పదవికి తమ మార్గం సుస్పష్టంగా ఉండేలా ఎస్పీ నన్ను దేశానికి రాష్ట్రపతిని చేయాలని కలలు కంటోంది ’’ అని మాయావతి అన్నారు.
‘‘ నేను నా జీవితాన్నిసౌకర్యవంతంగా గడపలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ చూపిన మార్గంలో నడిచాను. అణగారిన వర్గాలు వారి కాళ్లపై వాళ్లు నిలబడటానికి కృషి చేశాను. అయితే ఇలాంటి పనులు రాష్ట్రపతి పదవిని అధిరోహించడం ద్వారా సాధ్యం కాదని, యూపీ సీఎం అవ్వడం ద్వారా లేకపోతే దేశ ప్రధానిగా ఎదగడం ద్వారానే జరుగుతుందని అందరికీ తెలుసు’’ అని ఆమె అన్నారు.
మాయావతి రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారని, అందుకే ఆమె ఓట్లు బీజేపీకి వెళ్లాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల కామెంట్స్ చేశారు. ‘‘ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ మాయావతిని రాష్ట్రపతిని చేస్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ ఉంది.’’ అని అఖిలేష్ అన్నారు.
కాగా.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే యూపీలో 2019 లోక్ సభ ఎన్నికలలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ తరువాత రెండు పార్టీలు విడిపోయాయి. క్రమం తప్పకుండా ఒక పార్టీ నాయకులపై మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ 111 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. బీఎస్పీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. బీజేపీ పూర్తి మెజారిటీతో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది.
మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఓ దశలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అధికారం కూడా చేపట్టింది. మాయవతి సీఎంగా కూడా పని చేశారు. కానీ క్రమంగా ఆ పార్టీ యూపీలో ప్రాబల్యం కోల్పోతూ వస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పతనమైంది. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇటీవల మాయావతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని మాయావతికి సమాచారం అందించామని కానీ ఆమె స్పందించలేదని అన్నారు. బహుషా ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి ఉండొచ్చని ఆరోపించారు. ఈ కామెంట్స్ కు ఆమె ధీటుగానే బదులిచ్చింది. ముందు కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకోవాలని, తరువాత ఇతర పార్టీలపై మాట్లాడాలని సూచించారు.