
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో పూణె జిల్లాలలోని వార్ మెమోరియల్ వద్ద 2018 జనవరిలో జరిగిన హింసకు సంబంధించిన భీమా కోరేగావ్ కేసులో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు దర్యాప్తు ప్యానెల్ సమన్లు జారీ చేసింది. మే 5వ, 6వ తేదీల్లో ప్యానెల్ ముందు విచారణకు హాజరవ్వాలని భీమా కోరేగావ్ ఇంక్వైరీ కమిషన్ పేర్కొంది. 2020లోనూ శరద్ పవార్‌కు సమన్లు పంపింది. కానీ, కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఆయన హాజరుకాలేదు.
ఆ తర్వాత మరోసారి ఈ ఏడాది ఫిబ్రవరి 23వ, 24వ తేదీల్లో హాజరుకావాలని సమన్లు పంపింది. కానీ, అప్పుడు కూడా ఆయన ప్యానెల్ ముందు హాజరుకాలేదు. అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన ఆయన తన వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి ఫ్రెష్ డేట్స్ కావాలని కోరారు. ఈ అఫిడవిట్‌ను ఆయన ఇటీవలే సమర్పించారు. ఈ నేపథ్యంలోనే భీమా కోరేగావ్ ఇంక్వైరీ కమిషన్ తాజాగా, బుధవారం మరోసారి ఆయనకు సమన్లు పంపింది.
2018లో చోటుచేసుకున్న ఈ హింసపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శరద్ పవార్‌ను దర్యాప్తునకు పిలిచి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని వివేక్ విచార్ మంచ్ సభ్యుడు సాగర్ షిండే దర్యాప్తు కమిషన్‌కు అప్లికేషన్ పెట్టాడు. 2020 ఫిబ్రవరిలో ఈ అప్లికేషన్ పెట్టాడు. ఈ దరఖాస్తు నేపథ్యంలోనే దర్యాప్తు కమిషన్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు సమన్లు జారీ చేసింది.
1818లో జరిగిన భీమా కోరేగావ్ యుద్ధానికి రెండు శతాబ్దాలు గడిచిన సందర్భంగా 2018 జనవరి 1న దళితులు పెద్ద ఎత్తున పూణెలోని భీమా కోరేగావ్ వద్ద నిర్మించిన యుద్ధ స్మారకం వద్దకు చేరారు. జనవరి 1వ తేదీన ఈ యుద్ధాన్ని స్మరిస్తుంటారు. ఈ ద్విశత స్మారక వేడుకలు జరుపుకుంటుండగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అయితే, ఈ ఘర్షణలకు 2017 డిసెంబర్ 31వ తేదీన నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సదస్సులో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణం అని పూణె పోలీసులు భావించారు. ఈ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే భీమా కోరేగావ్ ఘర్షణలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అయితే, ఎల్గార్ పరిషద్ సదస్సు నిర్వాహకులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేవి పోలీసులు చేస్తున్న మరో ఆరోపణ.