
శ్రీరామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అల్లర్లను దేశం ఇంకా మరవక ముందే ఒడిశాలో ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది. సంబల్పూర్ జిల్లాలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బుధవారం మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలో 10 మంది పోలీసులకు గాయాలు కాగా, పలు వాహనాలు దగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన 10 మంది పోలీసుల్లో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సంబల్పూర్ జిల్లాలో మోటార్ బైక్ ర్యాలీపై నిర్వహించారు. 100 మందికి పైగా పాల్గొన్న ఈ ర్యాలీ నగరంలోని ధనుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదాపర, సునప్లి మీదుగా ర్యాలీ వెళ్తుండగా వెళ్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వారు. దీంతో హింస చోటు చేసుకుంది.
ప్రతీ ఏటా ఒడిశాలో మహా విషువ సంక్రాంతి నాడు హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. అయితే ఈ సారి ఏప్రిల్ 15వ తేదీన జరుపుకోనున్నారు. అందులో భాగంగానే బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ మత ఘర్షణలో పలు వాహనాలకు దుండగులు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో బైకులు దగ్ధం అయ్యాయి. పలు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఓ తాత్కాలిక దుకాణాన్ని కూడా దుండగులు దగ్ధం చేశారు.
ఈ అల్లర్ల పై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, మిగితా ఏడుగురు పోలీసు సిబ్బందికి గాయాలు అయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తంగా హాస్పిటల్ కు తరలించారు.
హింస తరువాత, సంబల్ పూర్ నగరంలోని మొత్తం ఆరు పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో సీఆర్ పీసీ సెక్షన్ 144 ను విధించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో తగిన బలగాలను మోహరించినట్లు అదనపు ఎస్పీ తపన్ కె మొహంతి మీడియాతో తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. గాయపడిన పోలీసులు చికిత్స కోసం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.