తెలుగు దేశం పార్టీపై విమర్శల డోసును పెంచుతున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.
విజయవాడ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి 54 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే రిపోర్టులు చెబుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. శుక్రవారం నాడు విజయవాడ ఆటోనగర్ లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ ను కేశినేని నాని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతిలో రాజధానిని ఏర్పాటు విషయమై కూడ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి 30 ఏళ్లైనా పూర్తి కాదన్నారు. ఈ విషయాన్ని తాను అప్పట్లో చెప్పానన్నారు. తన వద్దకు వచ్చిన అమరావతి రైతుల వద్ద కూడ ఇదే విషయాన్ని చెప్పానన్నారు. చంద్రబాబు మోసం చేశారని తాను అమరావతి రైతుల వద్ద కూడ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. షాజహాన్ తాజ్ మహాల్ కట్టారు. అమరావతి కట్టినట్టుగా చరిత్రలో తన పేరు కోసం చంద్రబాబు ప్రయత్నించారని నాని విమర్శలు చేశారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.ఈ విషయమై మీడియా స్పష్టంగా రిపోర్టు చేయాలని ఆయన కోరారు.
also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు
తనకు విజయవాడ ఆటోనగర్ అంటే ప్రాణమన్నారు. బాండ్ లేకుండా 2 ఎకరాలు రాసిచ్చినట్టుగా చెప్పారు. ఇప్పుడు దాని విలువ రూ.100 కోట్లుగా ఆయన చెప్పారు. విజయవాడలోని ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లోని బైపాస్ లు పూర్తి చేస్తే లారీలు నగరంలోకి రావని కేశినేని నాని చెప్పారు. విజయవాడ ఎంపీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా జగన్ తన పేరును ప్రకటించినందుకు కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు.జగన్ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టుగా చెప్పారు.
also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ
ఈ నెల 4వ తేదీన కేశినేని నాని తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో కేశినేని నాని భేటీ అయ్యారు. అదే రోజున విజయవాడ ఎంపీ పదవికి కూడ కేశినేని నాని రాజీనామా చేశారు.ఈ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత కేశినేని నాని వైఎస్ఆర్‌సీపీలో చేరనున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన రోజు నుండి తెలుగు దేశం పార్టీపై కేశినేని నాని విమర్శల దాడిని పెంచుతూ వచ్చారు.