
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలు రేపు (సెప్టెంబర్ 9, మంగళవారం) జరగనున్నాయి. ఎన్నికలకు ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈరోజు(సోమవారం) ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు సమావేశం కానున్నారు. ఇందులో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలన్నది ఎంపీలకు వివరిస్తారు. ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో రాత్రి భోజన విందు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఇప్పటికే అధికార ఎన్డిఏ కూటమి తమ ఎంపీలకు ఉపరాష్ట్రపతి పోలింగ్ విధానంపై వర్క్ షాప్, మాక్ పోలింగ్ నిర్వహించింది. నిన్న (ఆదివారం) పార్లమెంట్ హౌప్ లోని జీఎంసి బాలయోగి ఆడిటోరియంలో ఈ వర్క్ షాప్ జరిగింది. ఇందులో ఎంపీలు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు.
నిన్న ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి అందరు ఎంపీల మద్దతు కోరుతూ వీడియో సందేశం విడుదల చేశారు. ఎన్నికైతే రాజ్యసభను చర్చలకు నిజమైన వేదికగా మారుస్తానని… పార్లమెంటరీ కమిటీలను రాజకీయ ఒత్తిళ్ల నుండి విముక్తి చేస్తానని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఎన్డీయే ఎంపీలు కూడా ఈరోజు సమావేశం కావచ్చు. మొత్తం 783 మంది ఎంపీల్లో ఎన్డీయేకి 422 మంది, ప్రతిపక్షానికి 320 మంది ఉన్నారు.
అయితే బిజు జనతాదళ్, బీఆర్ఎస్ పార్టీలు ఇంకా తమ వైఖరిని ప్రకటించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తేలేదని బిఆర్ఎస్ వర్క్ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కాబట్టి బిఆర్ఎస్ ఎంపీలు ఎన్డిఏ కూటమి అభ్యర్థికి మద్దతిస్తారా? లేదంటే ఓటింగ్ లో పాల్గొనకుండా తటస్థంగా ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.