
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరువనంతపురం- కాసరగోడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ లోకి వర్షపు నీరు లీక్ అవుతున్న సిబ్బంది గుర్తించారు. వెంటనే దానిని రిపేర్ చేశారు.
భారత్ పై జర్మనీ అక్కసు.. జనాభా పెరుగుదలను చూపిస్తూ వ్యంగ్యంగా కార్టూన్.. మండిపడుతున్న నెటిజన్లు
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కేరళలోని కన్నూర్ లో కూడా వర్షం కురిసింది. అయితే కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నీరు, ఇతర అవసరాల కోసం మంగళవారం రాత్రి కాసర్‌గోడ్ నుండి కన్నూర్‌కు వచ్చింది. అయితే అక్కడ రెండో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న సమయంలో ఓ ఎగ్జిక్యూటివ్ కోచ్ లో వర్షపు నీరు లీకేజీ అవుతుందని గుర్తించి దానిని అక్కడే నిలిపివేశారు. కోచ్ లోని ఏసీ వెంట్ ద్వారా ఈ లీకేజీ జరుగుతోందని అధికారులు గుర్తించారు. దీంతో బుధవారం ఉదయం రిపేర్ చేసి, లీకేజీని సరి చేశారు. ఇది పెద్ద లీకేజీ కాదని, కేవలం ఒక బోగీలో మాత్రమే సంభవించిందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ మరమ్మతు నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణించాల్సిన షెడ్యూల్ ను మార్చారు.
మరో ఘటనలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లకు పాలక్కాడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్ పోస్టర్లను కార్యకర్తలు అతికించారు. ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించిన తరువాత రైలు తిరువనంతపురం నుంచి షోరనూర్ జంక్షన్‌కు చేరుకుంది. దీంతో ఆ స్టేషన్ కు ఒక్క సారిగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీ వీకే శ్రీకందన్ ను ప్రశంసిస్తూ పోస్టర్లు అతికించారు. ఈ అధునాతన రైలును షోరనూర్ జంక్షన్‌లో ఆపేందుకు కృషి చేశారంటూ ఆయనను కొనియాడారు. తరువాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది రైలుపై అతికించిన ఈ పోస్టర్లను తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. కేరళ మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుండి ఉత్తరాన ఉన్న జిల్లా కాసరగోడ్‌ను కలుపుతుంది. 16 కోచ్‌లతో కూడిన ఈ రైలు 11 స్టేషన్లను కవర్ చేస్తుంది. వీటిలో కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిస్సూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ ఉన్నాయి. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వెళ్లడానికి ఈ రైలు దాదాపు 8 గంటల 05 నిమిషాలు తీసుకుంటుంది. కాసరగోడ్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు తిరిగి తిరువనంతపురం చేరుకుంటుంది.`