
మైసూరు : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ కర్ణాటకలోని మైసూరులోని ఓ హోటల్‌లో దోసెలు వేసేందుకు ప్రయత్నించారు. కర్ణాటకలో త్వరలో జరగబోతునున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, ప్రియాంక గాంధీ హోటల్ వంటగదిలో, సిబ్బందితో మాట్లాడడం, దోసెలు వేయడం.. దోసెలు తిప్పడం కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్ మైలారి హోటల్, మైసూరులోని పురాతన ఫుడ్ జాయింట్‌లలో ఒకటి. దోసెలు వేసిన తరువాత ప్రియాంక గాంధీ హోటల్ యజమానికి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారితో సెల్ఫీ దిగారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. నిన్న మైసూరులో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. 'ప్రధాని ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష నేతలు ఆయనకు సమాధి తవ్వాలనుకుంటున్నారని అన్నారు. ఇలాగేనా మాట్లాడేది? దీనికేమైనా అర్థం ఉందా? దేశంలోని ప్రతి పౌరుడు ప్రధాని ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారని, ప్రధాని ఆరోగ్యంగా ఉండాలి" అని అన్నారు.
అంతేకాదు.. “కర్ణాటక ప్రజలు ఏ నాయకుడి మాటలనూ విని ఓటు వేయకకండి, వారి మనస్సాక్షిని విని ఓటు వేయాలి” అని ఆమె అన్నారు. కర్ణాటకలో భాజపా ఎలాంటి నిర్మాణాత్మక పనులు చేయనందున, రాష్ట్రంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.