ఉత్తరాఖండ్‌లోని ఆరు నెలల చిన్నారిపై కేసు నమోదు చేయడం వివాదస్పదంగా మారింది. దీంతో జువైనల్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించినవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ఆరు నెలల చిన్నారిపై కేసు నమోదు చేయడం వివాదస్పదంగా మారింది. దీంతో జువైనల్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... లాక్ డౌన్ వేళ హోం క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించిన 51 మందిపై ఉత్తరకాశీ జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో 6 నెలలు, రెండేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. అయితే జువెనైల్ చట్టం ప్రకారం ఎనిమిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిపై కేసు నమోదు చేయరాదు.
దీనిపై స్పందించిన ఉత్తర కాశీ జిల్లా కలెక్టర్.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జువైనల్ చట్టానికి వ్యతిరేకంగా చిన్నారులపై కేసు నమోదు చేసినవారిపై క్రమశిక్షణ చర్యలతో పాటుగా, సెస్పెన్షన్ వేటు వేయనున్నట్టు చెప్పారు.
కాగా, కరోనా కట్టడిలో భాగంగా ఇండియాలో లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 23,452 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా బారి నుంచి 4,814 మంది కోలుకున్నారని.. 723 మంది మృతిచెందారని వెల్లడించింది.