Uttarakhand Assembly Election 2022 : ఉత్త‌రాఖండ్ మంత్రి వ‌ర్గం నుంచి హ‌ర‌క్ సింగ్ రావ‌త్ బ‌ర్త్ ర‌ఫ్

By team teluguFirst Published Jan 17, 2022, 11:04 AM IST
Highlights

ఉత్త‌రాఖండ్ మంత్రి వ‌ర్గం నుంచి హ‌ర‌క్ సింగ్ రావ‌త్ బ‌ర్త్ ర‌ఫ్ అయ్యారు. బీజేపీ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం రావత్ ఆటవీ, పర్యావరణ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ఈ పరిణామం చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.  

Uttarakhand Assembly Election 2022 : ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా నెల రోజులు ముందు ఉత్త‌రాఖాండ్ మంత్రి వ‌ర్గం నుంచి హ‌ర‌క్ సింగ్ రావ‌త్ (harak singh ravath) బ‌ర్త్ ర‌ఫ్ అయ్యారు. అలాగే బీజేపీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెన్షన్ కు గుర‌య్యారు. ఈ మేర‌కు సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి (pushkar singh dhami) గ‌వ‌ర్న‌ర్ కు స‌మాచారం అందించార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. హ‌ర‌క్ సింగ్ రావ‌త్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ప‌ని చేస్తున్నారు. మంత్రి వ‌ర్గం నుంచి బ‌హిష్క‌ర‌ణ విష‌యంలో ఆయ‌న స్పందించారు. బ‌హిష్క‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి, పార్టీ నుంచి త‌న‌కు ఎలాంటి స‌మాచారం రాలేద‌ని చెప్పారు. త‌న‌కు కూడా సోష‌ల్ మీడియా ద్వారానే ఈ విష‌యం తెలిసింద‌ని తెలిపారు. అయితే కాంగ్రెస్ (congress) లో చేరుతున్నట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా స్పందించారు. బీజేపీ (bjp) క‌చ్చితంగా ఈ నిర్ణ‌యం తీసుకుంటే తాను ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. 

బీజేపీ త‌న విష‌యంలో ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకునే ముందు త‌న‌తో ఒక్క సారి కూడా సంప్ర‌దింపులు జ‌ర‌ప‌లేద‌ని హ‌ర‌క్ సింగ్ రావ‌త్ అన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరకపోయి ఉంటే నాలుగేళ్ల క్రితమే రాజీనామా చేసి ఉండేవాడిన‌ని తెలిపారు. మంత్రి ప‌ద‌విపై త‌న‌కు పెద్దగా ఆస‌క్తి లేద‌ని, కేవ‌లం ప‌ని చేయాల‌ని అనుకున్నాని పేర్కొన్నారు. 

2016 సంవ‌త్స‌ర‌లో హరీష్ రావత్ (harish rawath) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలలో హ‌ర‌క్ సింగ్ రావ‌త్ కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న 
కోట్‌ద్వార్ (kotedwar) అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అయితే తాను ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చాల‌ని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో పాటు త‌న కోడ‌లు అనుకృతి గుసేన్ కు లాన్స్ డౌన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కానీ దీనిపై బీజేపీ ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే కొంత‌కాలంగా పార్టీ నాయ‌క‌త్వంపై విసిగి పోయి, తిరిగి కాంగ్రెస్ లోకి చేరాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. 

డిసెంబ‌ర్ నెల‌లో హ‌ర‌క్  సింగ్ రావ‌త్ త‌న నియోజకవర్గమైన కోట్‌ద్వార్‌లో ప్రతిపాదిత మెడికల్ కాలేజీ నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం చేశారు. అనంత‌రం సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అనేక వార్త‌లు వెలువ‌డ్డాయి. కానీ దీనిని ఆ స‌మ‌యంలో అధికార బీజేపీ కొట్టిపారేసింది. మంత్రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని, ఆయ‌న ఎక్క‌డికీ వెళ్ల‌డం లేద‌ని, మంత్రి వ‌ర్గంలో కొన‌సాగుతార‌ని స్ప‌ష్టం చేసింది. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలోనే బీజేపీ నుంచి  రావత్ ను పార్టీ నుంచి సస్పెండ్ ను చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. 70 మంది సభ్యులున్న ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి.  మార్చి 10న కౌంటింగ్ చేపట్టనున్నారు. 
 

click me!