
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తమ్ముడు శైలేంద్ర మోహన్‌కు ప్రమోషన్ వచ్చింది. సుబేదార్ మేజర్‌గా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఇది గర్హవాల్ స్కైట్స్ రెజిమెంట్‌లో ఉన్నతమైన నాన్ కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంక్. ఈ ప్రమోషన్ తర్వాత గౌరవపూర్వకమైన కెప్టెన్ హోదా ఉంటుంది. శైలేంద్ర మోహన్ చైనాతో సరిహద్దు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)లో విధులు నిర్వర్తిస్తున్నారని అధికారులు తెలిపారు.
గర్హవాల్ స్కైట్ యూనిట్ ఎక్కువగా స్థానికులను రిక్రూట్ చేసుకుంటుంది. వీరిని సైనికులుగా సరిహద్దులో మోహరింపజేస్తుంది. వ్యూహాత్మకమైన కొండ ప్రాంత సరిహద్దుల్లో వీరు పహారాకాస్తారు. ఈ సరిహద్దు ప్రాంతాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే.. చొరబాట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే ఉంటుంది.
కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబేదార్ శైలేంద్ర మాట్లాడుతూ.. భారత ఆర్మీతో అనుబంధంలో ఉన్నందుకు తాను చాలా గర్వపడుతున్నట్టు మురిసిపోయారు. దేశం కోసం మడమతిప్పని సంకల్పంతో పని చేస్తున్నట్టు తెలిపారు. అదే ఇంటర్వ్యూలో తన అన్నయ్య యోగి ఆదిత్యానాథ పట్ల ప్రేమాసక్తులను కలిగి ఉన్నట్టు చెప్పారు. కానీ, సమయాభావం వల్ల తాను అన్నయ్య యోగి ఆదిత్యానాథ్‌ను కలువలేకపోతున్నట్టు అన్నారు.
యోగి ఆదిత్యానాథ్ యూపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీలో కొద్దిసేపు ఆయనను కలిసి మాట్లాడినట్టు సుబేదార్ శైలేంద్ర గుర్తు చేసుకున్నారు. దేశం కోసం సేవ చేయడానికి యోగి ఆదిత్యానాథ్ తనకు ప్రోత్సాహం అందించారని తెలిపారు. తామిద్దరమూ దేశానికి సేవ చేయడంలో కట్టుబడి ఉన్నామని వివరించారు.
యోగి ఆదిత్యానాథ్‌కు ముగ్గురు సోదరులు ఉన్నారు. మానవేంద్ర మోహన్ పెద్దవారు. యోగి ఆదిత్యానాథ్‌కు శైలేంద్ర మోహన్, మహేంద్ర మోహన్‌లు తమ్ముళ్లు.