UP Assembly Election 2022: అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులు.. సీఎం యోగి పోటీ అక్కడి నుంచే... !

By Mahesh RajamoniFirst Published Jan 13, 2022, 11:20 AM IST
Highlights

UP Assembly Election 2022: దేశంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. అన్ని పార్టీలు ముమ్మ‌ర ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే 172 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు చేసింది. ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్య నుంచి పోటీ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. అయితే, సంబంధిత వివ‌రాల‌ను గురువారం అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. 
 

UP Assembly Election 2022: దేశంలో త్వ‌ర‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అయితే, అధికారం ద‌క్కించుకోవాల‌ని స‌మాజ్ వాదీ పార్టీ, బీజేపీలు గ‌ట్టిగానే ప్రయ‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి దెబ్బ మీద బెబ్బ‌లు త‌గులుతున్నాయి. రాష్ట్ర బీజేపీ కీల‌క నేత‌లు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ నాయ‌క‌త్వం ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ అగ్రనాయకత్వం సుదీర్ఘంగా స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో బీజేపీ-మిత్ర ప‌క్షాల‌కు సంబందించి చ‌ర్చ‌లు సైతం జ‌రిగాయి. ఈ స‌మావేశంలో 172 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుండి పోటీ చేయడం భారతీయ జనతా పార్టీకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. ఆయ‌న అక్క‌డి నుంచే పోటీ  చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు ఇంకా నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నందున, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ బుధవారం నాడు సుదీర్ఘ స‌మ‌యం స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల, మిత్ర ప‌క్షాల‌తో సీట్ల పంపిణీ వంటి విష‌యాలు చ‌ర్చించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి మూడు దశల్లో పోలింగ్ జరగనున్న172 స్థానాల అభ్యర్థుల పేర్లను బీజేపీ ఖరారు చేసింది. బీజేపీ వ‌ర్గాల వివ‌రాల ప్ర‌కారం..  దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం మావేశ‌మైంది. ఎన్నిక‌ల‌కు సంబంధించి 300  స్థానాల‌పై చ‌ర్చ జ‌రిగింది. అయితే మొదటి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న 172 స్థానాలకు పేర్లు ఖరారు చేయబడ్డాయి. ఈ విరాల‌ను ప‌రిశీలించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  తుది నిర్ణ‌యం తీసుకోనుంది. గురువారం జ‌రిగే ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ పాల్గొన‌నున్నారు. 

బుధ‌వారం జ‌రిగిన ఈ స‌మావేశంలో బీజేపీ మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు (జనవరి 13) తెల్లవారుజామున 1:35 గంటలకు ఇది ముగిసింది. గురువారం జరగనున్న సీఈసీ సమావేశం తర్వాత సీట్ల పంపకాల పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్‌కు 11 సీట్లు, ఓంప్రకాష్ రాజ్‌భర్ పార్టీకి 8 సీట్లు ఇచ్చింది. అయితే, ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఈ స‌మావేశంలో బీజేపీ వీడుతున్న మంత్రులు, నేత‌ల గురించి కూడా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. 

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల 2022 తేదీలను ప్రకటించినప్పటి నుండి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఏ స్థానం నుండి పోటీ చేస్తారు అనేదే ఎక్కువగా చర్చనీయాంశమైంది. సీఎం యోగి అయోధ్య(Ayodhya) నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. అయోధ్య నుండి ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే ఆదిత్యనాథ్ నియోజకవర్గంపై గురువారం జ‌రిగే  సీఈసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆదిత్యనాథ్ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను మధుర నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ గతంలో లేఖ రాశారు. 

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
 

click me!