
గువాహటి : అమెరికాలో గుండె పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయం స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి Pig Heart అమర్చడం, ఆ సర్జరీ విజయవంతమై సదరు వ్యక్తి సొంతంగా ఊపిరి పీల్చుకోగలగడం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారిలో భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. అమెరికా శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు అని ప్రశంసలు కురిపిస్తుంది.
కానీ, ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే.. పెద్దగా సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే... మన దేశానికి చెందిన ఓ వైద్యుడు ఈ సర్జరీ చేశాడు. ఓ 32 యేళ్ల వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చగలిగాడు. కానీ తాను చేసిన కొన్ని పొరపాట్లతో ఆ ఘనతను తన ఖాతాలో వేసుకో లేకపోయాడు. పైగా పోలీసు కేసులు, జైలు శిక్షను ఎదుర్కొన్నాడు.
లేకుంటే ప్రపంచంలో తొలి ‘హార్ట్ జెనో transplant (జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడం) చేసిన వైద్యుడిగా నిలిచిపోయేవాడు. ఇంతకీ ఆ వైద్యుడు ఎవరో తెలుసా?.. అస్సాంలోని సోనాపూర్ కు చెందిన వైద్యుడు Dhaniram Barua. ప్రస్తుతం 68ఏళ్ల వయసున్న ఆయన అప్పట్లో ఏం చేశారు.. ఏం జరిగిందో. చూడండి...
ప్రపంచస్థాయి వైద్యుడు ఆయన..
అస్సాం రాజధాని గువాహటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారు పట్టణం సోనాపూర్. ‘టైం కంటే ముందు ఉండే డాక్టర్’ గా పేరొందిన డాక్టర్ ధనిరామ్ బారువా అక్కడ సొంతంగా ‘ధనిరామ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్ ఇంజనీరింగ్’ వైద్య కళాశాలను నడుపుతుండేవారు.
1980వ దశకం లోనే ఆయన ప్రపంచంలోని గొప్ప గుండె వైద్య నిపుణులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. గుండెలో దెబ్బతిన్న వాల్వ్ ల స్థానంలో అమర్చేందుకు 1989లోనే కృత్రిమంగా ‘బారువా హార్ట్ వాల్వ్’లను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ వాల్వ్ లను వినియోగిస్తున్నారు కూడా. ఇదేకాదు సొంతంగా మరెన్నో పరిశోధనలు చేశారు. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ కూడా ధనిరామ్ బారువాను పలుమార్లు ప్రశంసించారు. కానీ 1977లో ఆయన చేసిన ప్రయోగంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
అనైతికం, ప్రమాదకరం అంటూ..
ధని రామ్ బారువ 1997 జనవరిలో హాంకాంగ్కు చెందిన జోనాథన్ హోకీ సింగ్ అనే హార్ట్ సర్జన్ తో కలిసి సంచలన ప్రయోగం చేశారు. గుండెకు రంధ్రం పడిన ఓ 32 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేసి పంది గుండెను అమర్చారు. ఇప్పుడున్నంత వైద్య వసతులు లేని ఆ కాలంలో తన వైద్య కళాశాలలోనే ధనిరామ్ విజయవంతంగా ఈ సర్జరీ చేయడం విశేషం. వారం రోజులపాటు బతికిన ఆ పేషంట్.. పలు రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా వారం రోజుల తర్వాత చనిపోయాడు. ఇది ఒక్కసారిగా ఆందోళనలు రేపింది. మనుషులకు పంది గుండె అమర్చడం అనైతికమని, సదరు పేషెంట్ మరణానికి ధనిరామ్ బారువా కారణమంటూ విమర్శలు వచ్చాయి.
ఆ పొరపాటుతో కేసులు, జైలు..
అప్పటికే ప్రపంచస్థాయి హార్ట్ సర్జన్ అయిన ధనిరామ్ బారువా.. ‘జెనో ట్రాన్స్ప్లాంటేషన్’ కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. అంతేకాదు తన పరిశోధనల వివరాలను ఉన్నతస్థాయి సమీక్షలకు పంపకుండానే. నేరుగా పంది గుండె అమర్చే సర్జరీ చేశారు. దీంతో ఆయనపై, ఆసుపత్రి పై కేసులు నమోదయ్యాయి. 40 రోజులు జైల్లో ఉన్నాక బెయిల్పై విడుదల అయ్యారు. కానీ, అప్పటికే ఆందోళనకారులు ఆయన ఆసుపత్రిని, ఆస్తులను ధ్వంసం చేశారు. నీళ్లు, కరెంట్ అందకుండా చేశారు. ఆ సమయంలో సుమారు ఏడాదిన్నర పాటు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా గడపాల్సి వచ్చింది.
వివాదాస్పద ఆవిష్కరణలతో..
తన ఆసుపత్రి దెబ్బతిన్నా, తనపై ఎన్నో ఆరోపణలు చేసినా.. తన పరిశోధనలు కొనసాగించాడు. కొన్ని ఆవిష్కరణలు చేసినట్టుగా ప్రకటించాడు. కానీ వాటిపై పలు వివాదాలు తలెత్తాయి. పుట్టుకతో పాటు వచ్చే గుండె సమస్యలను సరిచేసే జన్యుమార్పిడి వ్యాక్సిన్ను రూపొందించినట్టు 2008లో ధనిరామ్ బారువా ప్రకటించారు. హిమాలయాల్లోని ఔషధ మొక్కల నుంచి హెచ్ఐవిని నియంత్రించే జన్యువులను సేకరించామని 86 మందిలో హెచ్ఐవి నిర్మూలించగలిగామని 2015లో ప్రకటించారు.
ముందుచూపున్న మేధావి..
డాక్టర్ ధనిరామ్ బారువా ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని, కానీ తగిన జాగ్రత్తలు, నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని అస్సాంకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు గోస్వామి తెలిపారు. 25 ఏళ్ల కిందట అంతంతమాత్రం సదుపాయాలతో గుండె మార్పిడి చేశారని.. అదే ఇన్నేళ్లలో అభివృద్ధి చెందిన సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా వైద్యులు పంది గుండెను మనిషికి అమర్చారని గుర్తు చేశారు.తన పరిశోధనలను పూర్తి స్థాయి సమీక్షలకు పంపక పోవడంతో అధికారిక గుర్తింపు పొందలేకపోయారు అని పేర్కొన్నారు.