
కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ మంత్రి కూడా చేరారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ అండ్ ఫ్లడ్ కంట్రోల్ మంత్రి విజయ్ కశ్యప్.. కరోనాకి బలయ్యారు. మంగళవారం ఆయన గుడ్ గావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
కశ్యప్(56) ముజఫర్ నగర్ లోని చర్త్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రిగా ఎన్నికయ్యారు. కాగా.. ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకింది. లక్షణాలు ఎక్కువగా ఉండటంతో.. ఆస్పత్రిలో చేర్పించగా... గుడ్ గావ్ లోని మేదంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గతేడాది కూడా ఉత్తరప్రదేశ్ లో మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ లు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. మంత్రి కశ్యప్ మృతి పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి తనను ఎంతగానో బాధించిందంటూ ప్రధాని మోదీ పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ లు కూడా మంత్రి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.