మాటలతో చంపేస్తున్నారు : చనిపోవడానికి అనుమతించండి.. గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి ఆవేదన

By Siva KodatiFirst Published Dec 5, 2019, 4:59 PM IST
Highlights

గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది.

అత్యాచారం.. ఆడబిడ్డల జీవితాన్ని చిదిమేసే ఘోరమైన నేరం. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతగా అవగాహనా కార్యక్రమాలు కల్పిస్తున్న మహిళలపై అకృత్యాలు ఆగడం లేదనడానికి నిత్యం ఎన్నో సంఘటనలు కనిపిస్తున్నాయి.

ఆయా కేసుల్లో నేరం రుజువై శిక్ష పడుతున్నా మృగాళ్ల పైశాచికానికి బలైన ఆడపిల్లలు పడే మానసిక వేదన వర్ణనాతీతం. ఈ క్రమంలో గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది.

Also Read:కదులుతున్న కారులో విద్యార్ధినిపై నలుగురు గ్యాంగ్‌రేప్: కారుకు పోలీస్ లోగో

గతేడాది అక్టోబర్ 18న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి భాదోఖర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న బాధితురాలిని ఓ సీఆర్పీఎఫ్ జవాన్, అతడి ఇద్దరు మిత్రులు తుపాకీతో బెదిరించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

దీనిపై రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరక్కపోవడంతో పాటు మానిసికంగా బాధితురాలు కృంగిపోతోంది. ఈ క్రమంలో తనను, తన భర్తను కారుణ్య మరణానికి అనుమతించాలని ఆమె బుధవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నివాసంలోకి ప్రవేశించింది.

ఈమెను, బాధితురాలి కుటుంబసభ్యులను భద్రతా సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... సామూహిక అత్యాచారానికి పాల్పడిని నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి లేదంటే తాము మరణించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులు ఉన్నారని.. వారి పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉన్నప్పటికీ వారు బయటకు హాయిగా తిరుగుతున్నారని.. కేసు విషయమై పోలీసులు ఏ చర్యా తీసుకోలేదన్నారు.

తాను, తన కుటుంబసభ్యులు భయం భయంగా రోజులు గడపాల్సి వస్తోందన్నారు. చుట్టుపక్కల వారి అవమానకరమైన విమర్శలను భరించలేక బయటకు వెళ్లటం కూడా మానేశానన్నారు. ఈ సూటిపోటీ విమర్శలను తట్టుకోలేక మానసిక కృంగుబాటుతో తన భర్త జబ్బున పడ్డాడని బాధితురాలు వాపోయింది.

Also Read:ఉన్నావ్ రేప్ విక్టిమ్ కోర్టుకు వెళ్తుండగా .. ఒంటికి నిప్పు అంటించి..

ముఖ్యమంత్రి తనకు న్యాయం చేయలేకపోతే కనీసం చనిపోవటానికైనా అనుమతివ్వాలని కోరుతున్నానని ఆమె కన్నీటి పర్యంతమైంది. దీనిపై రాయ్‌బరేలి జిల్లా ఎస్పీ స్వప్నిల్ మాంగాయిన్ స్పందిస్తూ... ఈ కేసుపై ఏఎస్పీ స్థాయి అధికారి విచారణను చేపట్టారని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

click me!