
Jobs : ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ఫైర్ సర్వీస్‌ను మరింత ఆధునికంగా, శక్తివంతంగా మార్చనుంది యోగి సర్కార్. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అభివృద్ధి, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకే ఫైర్ సర్వీస్‌ను కేవలం మంటలను ఆర్పడానికే పరిమితం చేయకుండా విపత్తు నిర్వహణ, రెస్క్యూ ఆపరేషన్లు, అత్యవసర సేవలతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించాారు. ఇందుకోసం భారీగా ఉద్యోగులను నియమించనున్నట్లు అగ్నిమాపక శాఖ సమీక్షా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ప్రతి రీజియన్‌లో రసాయన, జీవ, రేడియోలాజికల్ ప్రమాదాలను ఎదుర్కోగల ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సూపర్ హైరైజ్ భవనాల వంటి పరిస్థితులలో కూడా సహాయ, రెస్క్యూ పనులు వెంటనే చేపట్టేలా చూడాలన్నారు. ఏ అత్యవసర పరిస్థితిలోనైనా వెంటనే స్పందించేందుకు ఫైర్ సర్వీస్‌ను అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బందితో సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
సమావేశంలో శాఖాపరమైన కేడర్ రివ్యూపై చర్చిస్తూ గెజిటెడ్ కేడర్‌లో 98, నాన్-గెజిటెడ్ కేడర్‌లో సుమారు 922 కొత్త పోస్టుల సృష్టికి ఆమోదం తెలిపారు. ఈ పోస్టులతో ఫైర్ సర్వీస్‌కు జిల్లా, రీజినల్, ప్రధాన కార్యాలయ స్థాయిలో కొత్త బలం చేకూరుతుంది. శాఖ పరిపాలనా సామర్థ్యం, ఆర్థిక పారదర్శకత పెంచేందుకు ప్రతి జిల్లాలో అకౌంట్ కేడర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం యోగి చెప్పారు.
శిక్షణ, పరిశోధన నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర అగ్నిమాపక శిక్షణా కళాశాలలో అదనపు పోస్టులను సృష్టించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మెరుగైన శిక్షణతో ఫైర్ సర్వీస్ బృందం ఏ విపత్తులోనైనా వేగంగా, కచ్చితంగా స్పందించగలదని ఆయన అన్నారు.
ఎక్స్‌ప్రెస్‌వేలపై పెరుగుతున్న ప్రమాదాలపై సీఎం యోగి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి 100 కి.మీ.కి ఒక చిన్న ఫైర్ చౌకీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చౌకీలలో ఫైర్ టెండర్లు, అత్యవసర బృందాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి, తద్వారా ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో సహాయక చర్యలు ప్రారంభించవచ్చు.
కొత్త ఆపరేషనల్ యూనిట్లుగా కుషీనగర్, ఆజంగఢ్, శ్రావస్తి, కాన్పూర్ నగర్, అయోధ్య, అలీగఢ్, మొరాదాబాద్, చిత్రకూట్, సోన్‌భద్ర విమానాశ్రయాల్లో ఫైర్ యూనిట్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు అధికారులు సమావేశంలో తెలిపారు.
“ఫైర్ సర్వీస్ ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతతో ముడిపడి ఉన్న విభాగం. దీని నిర్మాణం ప్రతి పరిస్థితిలో వేగవంతమైన, సమర్థవంతమైన, జవాబుదారీ ప్రతిస్పందనను అందించేలా ఉండాలి” అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు త్వరగా ప్రయోజనం చేకూరేలా శాఖ పునర్వ్యవస్థీకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.