
Uttar Pradesh : తెలగాణలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఉత్తర ప్రదేశ్ లో మాత్రం రైతులకు ఎరువుల కొరత లేదు… ఈ విషయాన్ని స్వయంగా యోగి సర్కార్ ప్రకటించింది. అన్ని ప్రాంతాల్లోనూ సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. బ్లాక్ మార్కెట్, అధిక ధరలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ శాఖ మండలాల వారీగా ఎరువుల లభ్యత గణాంకాలను విడుదల చేసింది.
రాష్ట్రంలో 6.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 3.93 లక్షల టన్నుల డీఏపీ, 3.02 లక్షల టన్నుల ఎన్‌పీకే నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవసరానికి మించి ఎరువులు నిల్వ చేసుకోవద్దని సీఎం యోగి రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎరువుల లభ్యత, పంపిణీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన అన్నారు.
రైతుల సంక్షేమం కోసం యోగి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. యూరియా అసలు ధర బ్యాగ్‌కి ₹2,174 కాగా, సబ్సిడీతో రైతులకు ₹266.50కే అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 737 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. వ్యవసాయ రంగ జీఎస్వీఏ ఎస్పీ హయాంలో ₹2 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు ₹7 లక్షల కోట్లకు పెరిగింది.
ఖరీఫ్ 2024-25లో ఇప్పటివరకు 32.07 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది కంటే 4.5 లక్షల టన్నులు ఎక్కువ. రబీ 2025-26లో 138.78 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కంటే 4 లక్షల హెక్టార్లు ఎక్కువ. రైతులకు 10 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు, 12.80 లక్షల మినీ కిట్లు అందిస్తారు. చెరకు రైతులకు పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఉచిత విత్తనాలు ఇస్తారు. సరిహద్దు జిల్లాల్లో ఎరువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వ, అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.