స్వతంత్రంగా ఉండాలనుకుంటే పెళ్లి చేసుకోవడం మానేయండి.. కఠినంగా మాట్లాడిన సుప్రీంకోర్టు, ఎందుకు?

Published : Aug 22, 2025, 02:48 PM IST
Supreme court

సారాంశం

భార్యాభర్తల అనుబంధం గురించి సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. ఒక విడాకుల కేసులో సుప్రీంకోర్టు ఇలా మాట్లాడింది. అనుబంధం గురించి కోర్టు ఎందుకలా స్పందించాల్సి వచ్చిందో తెలుసుకోండి. 

విడాకుల కేసులు కోర్టులకు కొత్త కాదు. కానీ ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు చాలా కఠినమైన వ్యాఖ్యలను చేసింది. ఆ వ్యాఖ్య వినేందుకు కష్టంగా ఉండవచ్చు. కానీ అందులో ఎంతో నిజం ఉంది. వైవాహిక అనుబంధం గొప్పతనాన్ని సుప్రీంకోర్టు విడాకుల కోరిన జంటకు తెలియజేసేందుకు ప్రయత్నించింది. అసలు ఏం జరిగిందంటే...

ఇద్దరు భార్యాభర్తలకు కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. వారి వివరాలు మేము ఇక్కడ బయట పెట్టడం లేదు. ప్రస్తుతం భార్య హైదరాబాదులో ఉండగా, భర్త సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కూడా ఒకప్పుడు సింగపూర్ లోనే పిల్లలతో కలిసి ఉండేది. కానీ ఆమె పిల్లలతో కలిసి తిరిగి హైదరాబాద్ కు వచ్చేసింది. వీరి విడాకుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భార్య జడ్జిలతో మాట్లాడింది. ఆ సమయంలో తాను భర్తతో కలిసి ఉండాలని కోరుకోవడం లేదని చెప్పింది. ఆ జంటకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

మీ పిల్లలు ఏం తప్పు చేశారు?

జస్టిస్ బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌‌తో కూడిన ధర్మాసనం భార్యాభర్తల విషయంలో వివాహబంధంలోని గొప్పతనాన్ని తెలియజేసేందుకు కఠినమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ‘పెళ్లి చేసుకున్నాక ఏ భార్య లేదా భర్త పూర్తి స్వతంత్రంగా ఉండడం అసాధ్యం. వివాహం అంటేనే రెండు ఆత్మలు, వ్యక్తుల కలయిక. మీరు ఎలా స్వతంత్రంగా జీవించగలరు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇద్దరు చిన్నపిల్లలు విడిపోయిన జంటతో ఆనందంగా ఎలా ఉంటారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భార్యాభర్తలు ఇద్దరితో ‘మీరు కలిస్తే మేము సంతోషపడతాము... ఎందుకంటే మీ పిల్లలు చాలా చిన్నవారు. వారు తల్లిదండ్రులు విడిపోవడాన్ని చూడకూడదు. ఇందులో వారు చేసిన తప్పు ఏమిటి? ’ అని జడ్జిలు ప్రశ్నించారు. భార్యా భర్తలు ఇద్దరూ తమ విభేదాలను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రతి ఇంట్లోనూ ఒకరితో ఒకరికి ఏదో ఒక వివాదం ఉంటుందని దానికి విడాకులే పరిష్కారం కాదని సుప్రీంకోర్టు సున్నితంగా హెచ్చరించింది.

సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న భర్త దగ్గరికి వెళ్లడానికి మీ సమస్య ఏమిటని భార్యను ప్రశ్నించింది. దానికి ఆమె అక్కడ తాను జీవించేందుకు అనుకూలంగా లేదని చెప్పింది. తాను ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తున్నానని.. తన భర్త నుంచి ఎలాంటి భరణం కూడా అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేసింది సదరు మహిళ.

భర్త తరపున న్యాయవాది మాట్లాడుతూ సింగపూర్లో భార్యాభర్తలిద్దరికీ మంచి ఉద్యోగాలు ఉండేవని, కానీ భార్య పిల్లలతో సహా సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసిందని తెలిపారు. జస్టిస్ నాగరత్న భార్యతో మాట్లాడుతూ ‘మీకు ఉద్యోగం ఉండవచ్చు. కానీ మీ పిల్లల్ని పోషించే బాధ్యత మీ భర్తకు ఉంది. మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భర్త పై ఆధారపడి ఉంటారు. అది కేవలం ఆర్థికపరమైనదే కాదు, భావోద్వేగపరమైనది కూడా’ అని అన్నారు.

పిల్లాడి బర్త్ డే జంటగా చేయండి

తనకు ఆర్ధికంగా భర్తపై ఆధారపడడం ఇష్టంలేదని భార్య చెప్పడంతో... భర్త పై ఆధారపడి జీవించడం ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఆ భార్యను కోర్టు ప్రశ్నించింది. చదువుకున్నవారు తమ వివాదాలను తామే పరిష్కరించుకోవాలని సూచించింది. అంతేకాదు ఆ భార్యభర్తల చిన్న కొడుకు పుట్టినరోజు ఆగస్టు 23న జరగబోతోంది. ఆ పిల్లవాడి పుట్టినరోజుకి పిల్లలను తండ్రికి అప్పగించాలని, వేడుక సమయంలో తల్లి కూడా అక్కడ ఉండాలని కోర్టు కోరింది. తర్వాత విచారణను సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu