
Uttar Pradesh : చుట్టుపక్కల రాష్ట్రాల్లో వరద పరిస్థితిని చూసి ఉత్తర ప్రదేశ్ సర్కార్ చలించిపోయింది. అందుకే వరద బాధిత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లకు సీఎం యోగి 48 ట్రక్కుల్లో సహాయ సామాగ్రిని పంపించారు. ఈ కార్యక్రమం అంబాలా రోడ్డులోని సరోవర్ పోర్టికోలో జరిగింది.
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ… ఈ సహాయ సామాగ్రి అందించడం ద్వారా మానవత్వం చాటుకున్నామన్నారు. ఈ కష్టకాలంలో యూపీ ప్రజలు బాధితులకు అండగా ఉన్నారని అన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మరో రూ.5 కోట్ల చొప్పున అదనపు సాయం అందించినట్లు తెలిపారు.
యూపీ ప్రజల తరపున ఈ సహాయం అందిస్తున్నామని సీఎం యోగి అన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మిత్ర, పోలీసులు సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయని అన్నారు.
యూపీలో వరదలు ఎప్పుడూ సవాలుగానే ఉంటాయని, ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లోనే వరదలు వచ్చాయని, ముందస్తు చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని సీఎం యోగి అన్నారు. యమునా, గంగా, సరయు, ఘాఘర, రామ్‌గంగా, హిందన్ నదుల పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎక్కడైనా నష్టం జరిగితే వెంటనే సహాయం అందిస్తున్నామని తెలిపారు.
వర్షాకాలంలో ప్రమాదకర జంతువుల బారినపడితే… పాములు, తేళ్లు కుడితే రూ.4 లక్షల పరిహారం ఇస్తామని… ఇల్లు కూలిపోతే కొత్త ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని… భూమి కోల్పోయిన వారికి పట్టా, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తామని సీఎం యోగి చెప్పారు. వరద బాధితులకు ఆహారం, పిల్లలకు పాలు, పశువులకు మేత ఏర్పాటు చేశామని తెలిపారు.
యూపీలో బాధితులకు ఇచ్చే సామాగ్రినే 48 ట్రక్కుల్లో ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్‌లకు పంపిస్తున్నామని, ఉత్తరాఖండ్, హిమాచల్‌కు ₹5 కోట్ల చొప్పున అదనపు సాయం అందిస్తున్నామని సీఎం యోగి అన్నారు.
మంత్రి బ్రిజేష్ సింగ్ ఉత్తరాఖండ్‌కు, మంత్రి జస్వంత్ సైనీ హిమాచల్‌కు, ఎమ్మెల్యే రాజీవ్ గుంబర్ పంజాబ్‌కు సహాయ సామాగ్రిని తీసుకెళ్తారని సీఎం యోగి చెప్పారు. ఇంకా ఏమైనా సాయం కావాలంటే యూపీ ప్రభుత్వం, ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
వరదల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు మరిగించి తాగాలని, డెంగ్యూ, మలేరియా రాకుండా చూసుకోవాలని, పాములు, కీటకాలు కుడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సీఎం యోగి సూచించారు.
ఉత్తరాఖండ్, హిమాచల్‌లో జరిగిన విపత్తుల గురించి, సహాయక చర్యల గురించి సీఎం యోగి పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా సాయం చేయాలని కోరారు.
బియ్యం, పప్పు, బంగాళాదుంపలు, నూనె, ఉప్పు, పసుపు, కారం, మసాలా దినుసులు, శనగలు, బెల్లం, చక్కెర, బిస్కెట్లు, సబ్బులు, డెటాల్, శానిటరీ ప్యాడ్‌లు, టవల్స్, బట్టలు, బకెట్లు, మగ్గులు, టార్పాలిన్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు వంటివి ఉన్నాయి.